అంత్వార్‌లో సారాను నిషేధిస్తూ తీర్మానం

2 Aug, 2014 01:38 IST|Sakshi

విక్రయిస్తే ఆందోళన చేస్తామంటూ మహిళల హెచ్చరిక
 
నారాయణఖేడ్ : సారా విక్రయం లేదా తాగడం చేస్తే ఆందోళనలతో పాటు దాడులు చేస్తామని మండలంలోని అంత్వార్ గ్రామానికి చెందిన మహిళలు హెచ్చరించారు. గ్రామస్తులు పాటు ఖేడ్ ఎస్‌ఐ బాల్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం గ్రామం లో సారా విక్రయాలు జరపరాదని, సారాను తాగరాదని తీర్మానం చేశారు. సారాను విక్రయిస్తే రూ. 5 వేలు, సారా సేవిస్తే రూ.2 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు.

అనంతరం తీర్మాన పత్రంలో గ్రామస్తుల సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నలుగురు వ్యక్తులు సారాను విక్రయిస్తున్నారన్నారు. దీనికి కారణంగా ఎస్సీ కాలనీ ప్రజలు సారాకు బానిసై రోజూ భార్య బిడ్డలతో గొడ వలు పడుతున్నారని తెలిపారు.
 
గ్రామంలో నాటుసారా విక్రయిస్తున ్నట్లు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. అంతకుముందు గ్రామంలో సారాను పారబోసి నిరసన తెలిపారు. మళ్లీ సారా విక్రయాలు ప్రారంభిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళలు రాణమ్మ, దుర్గమ్మ, అనిత, జయశీల, కాంతమ్మ, స్వరూపరాణి, శక్కమ్మ, అనితమ్మ, రూథమ్మ, పీరమ్మ, శామమ్మ, పద్మమ్మ, గ్రామ ఎంపీటీసీ డేవిడ్,  సర్పంచ్ నిజలింగప్ప, ఉప సర్పంచ్ లింగమ్మ, ఖేడ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రసన్నకుమార్, గ్రామ పెద్దలు శంకర్‌రావు పాటిల్, శివరావ్, సాల్మన్, రాములు, వినోద్‌కుమార్,  తదితరులు ఉన్నారు.
 
సారాతో కాలనీలో శాంతి లేదు
సారాతో మా కాలనీల్లో ప్రశాంతత లేదు. రోజూ ఎవరో ఒకరు సారా తాగి గొడవలకు పాల్పడుతున్నారు. సారా విక్రయాలు నిలిపివేయాలని గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో మహిళలంతా ఏకమై సారాను దూరం చేయాలని తీర్మానం చేశాం.
 - రాణమ్మ, అంత్వార్ గ్రామ మహిళ
 
కుటుంబాల్లో సారా చిచ్చుపెడుతోంది
సారా తాగడంతో కుటుంబాల్లో కలహాలు జరుగుతున్నాయి. సారా తాగిన వారు సైతం అనారోగ్యానికి గురవుతున్నారు. సారా విక్రయాలు లేకపోతే మా గ్రామంలో ఎలాంటి గొడవలు ఉండవనే ఉద్దేశంతో తీర్మానం చేసేందుకు ముందుకు వచ్చాం. మాకు అధికారులు సహకారం కావాలి.
- దుర్గమ్మ, మహిళ, అంత్వార్

మరిన్ని వార్తలు