సరళాసాగర్‌ ఖాళీ..!

2 Jan, 2020 12:50 IST|Sakshi
మట్టి మేటలతో దర్శనమిస్తున్న సరళాసాగర్‌

గండితో నీరంతా ఏటిపాలు మట్టిమేటలు దర్శనం

కుడి, ఎడమ కాల్వలకు సాగునీరందించేందుకు కొనసాగిన అధికారుల సర్వే

వనపర్తి: రెండు రోజుల క్రితం వరకు నిండుకుండలా.. జలకళతో తొణికిసలాడిన సరళాసాగర్‌ ప్రాజెక్టు బుధవారం ఖాళీగా మారి మట్టి మేటలతో దర్శనమిచ్చింది. కేఎల్‌ఐ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నుంచి ఊర్లూ, వాగులు వంకలు దాటుతూ వందలాది కిలోమీటర్లు పరుగులెడుతూ.. వచ్చిన కృష్ణమ్మ కొమ్మిరెడ్డిపల్లి చెరువులో నుంచి నేటికీ కొద్దిపాటి నీటిధార సరళాసాగర్‌ ప్రాజెక్టులోకి వస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టులోకి వచ్చిన ప్రతీ నీటిచుక్క గండిపడిన ప్రదేశం నుంచి దిగువన ఉన్న రామన్‌పాడు జలాశయంలోకి వెళ్తున్నాయి. ఖాళీ అయిన సరళాసాగర్‌ ప్రాజెక్టులోని గుంతల్లో బురదలో ఉన్న చెపలు పట్టేందుకు మత్స్యకారులు, చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

నీరుపోయి.. మట్టిమేటలు దర్శనం
771ఎకరాల వైశాల్యం గల సరళాసాగర్‌ ప్రాజెక్టు ప్రస్తుతం నల్లని మట్టి మేటలు, చేపలు పట్టే మనుషులతో దర్శనమిస్తోంది. ప్రాజెక్టులో నీటిని చూసి నారుమడులు వేసుకున్న రైతులు రెండవ రోజు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ముందే హెచ్చరించినా అధికారులు పట్టించుకోకుండా మా కొంప ముంచారంటూ వారు శపనార్థాలు పెట్టడం కనిపించింది. ఇదిలాఉండగా,  మంగళవారం సరళాసాగర్‌ ప్రాజెక్టుకు గండిపడి సుమారు 0.5 టీఎంసీల నీరు వృథాగా దిగువునకు వెళ్లటంతో పాటు రూ.లక్షల విలువ చేసే మత్స్య సంపద సైతం నీటితో పాటు దిగువకు వెళ్లిపోయింది. టన్నుల కొద్ది చేపలు నీటి ప్రవాహంలో ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చి కాల్వ పొడవునా.. మట్టిలో మృతి చెంది పడ్డాయి. చనిపోయిన చేపల వలన దుర్వాసన వెదజల్లుతోంది.

రెండోరోజు కొనసాగిన సర్వే
సరళాసాగర్‌ కట్ట పునఃనిర్మాణం, ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు సాగునీరందించేందుకు ఏర్పాటు చేయాల్సిన రింగ్‌ బండ్, సమాంతరల కాల్వను తవ్వేందుకు ఇరిగేషన్‌ బోర్డు అధికారులు రెండవ రోజైన  బుధవారం సర్వే చేశారు. కొమ్మిరెడ్డిపల్లి వాగు నుంచి వచ్చే కేఎల్‌ఐ నీటిని సరళాసాగర్‌ ప్రాజెక్టులోని కుడి,ఎ డమ కాల్వలకు ఆయకట్టును బట్టి తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐబీ ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు.  

రెండు రోజుల్లో పనులు ప్రారంభించే అవకాశం
రింగ్‌బండ్, ప్రాజెక్టులో తాత్కాలిక సమాంతర కాల్వను తవ్వేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి సూచన మేరకు మరో రెండు రోజుల్లో అధికారులు పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. కానీ ఎన్ని రోజులు వస్తాయో తెలియని పరిస్థితి కాబట్టి రైతులు అధికారుల మాటలను నమ్ముకుని యాసంగి పంట సాగు చేసేందుకు ముందుకు వస్తారా అన్నది ప్రశ్నార్థమే.

మరిన్ని వార్తలు