మలేసియాలో బందీ

23 Oct, 2018 03:06 IST|Sakshi
మలేసియా ఎంబసీలో తలదాచుకున్న సారంపల్లివాసులు

     ఏజెంట్‌ మోసంతో దిక్కుతోచని స్థితిలో సారంపల్లి యువకులు 

     ఆదుకోవాలని సోషల్‌ మీడియా ద్వారా వినతి 

     స్పందించిన కేటీఆర్‌.. స్వదేశానికి రప్పించేందుకు చర్యలు

తంగళ్లపల్లి (సిరిసిల్ల): ఉపాధి కోసం ఉన్న ఊరును వదిలివెళ్లారు. ఏజెంట్‌ మాయమాటలను నమ్మి మోసపోయారు. ఇది మలేసియాలో బందీలైన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి యువకుల దుస్థితి. తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. సారంపల్లి గ్రామానికి చెందిన అశోక్, జిల్లెల్లకు చెందిన శ్రీకాంత్, కిరణ్‌ ఉపాధి కోసం మూడు నెలల క్రితం మలేసియా దేశం వెళ్లారు. ఇందుకోసం ఓ ఏజెంట్‌కు రూ.లక్షలు చెల్లించి వీసా తీసుకున్నారు.

మలేసియాలో అడుగుపెట్టాక వారికి అసలు విషయం తెలిసింది. తమకు ఏజెంట్‌ ఇచ్చింది కంపెనీ వీసా కాదని, విజిట్‌ వీసా అని తెలియడంతో నిర్ఘాంతపోయారు. సదరు ఏజెంట్‌ను ఫోన్‌ ద్వారా సంప్రదించగా, తానేమీ చేయలేనని చేతులెత్తేశాడు. దీంతో కూలీ పని చేసేచోట ఆసాములు ఓ గదిలో బంధించారు. మూడు రోజులపాటు భోజనం పెట్టడం లేదు. అయితే, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న ముగ్గురు యువకులు అక్కడి భారత రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. వారి చేతిలో చిల్లిగవ్వలేదు. బాత్రూంలోని నీరు తాగుతూ బతుకీడుస్తున్నారు. దీనిని అక్కడే ఉండే ఓ యువకుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇది ప్రస్తుతం జిల్లాలో వైరల్‌ అయింది.  

స్పందించిన కేటీఆర్‌ 
మలేసియాలో చిక్కుకున్న యువకుల వివరాలను తెలుసుకున్న స్థానిక నాయకుడు మాట్ల మధు.. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్‌ స్పందించి మలేసియాలోని భారత రాయ బార కార్యాలయ అధికారులతో ఫోన్‌లో మాట్లా డారు. బాధిత యువకులను స్వదేశానికి రప్పించేం దుకు ఏర్పాట్లు చేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. 

మరిన్ని వార్తలు