కవి శివారెడ్డికి సరస్వతి సమ్మాన్‌ 

29 Sep, 2019 03:29 IST|Sakshi
శివారెడ్డికి పురస్కారాన్ని అందజేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఢిల్లీలో ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు కవి డా. కె. శివారెడ్డికి సరస్వతి సమ్మాన్‌ పురస్కారం వరించింది. కేకే బిర్లా ఫౌండేషన్‌ ప్రదానం చేసే అత్యున్నత వార్షిక పురస్కారానికి 2018 ఏడాదికిగానూ ఆయన రచించిన ‘పక్కకి ఒత్తిగిలితే’కవితా సంపుటి ఎంపికైంది. శనివారం ఢిల్లీలో జరిగిన ఫౌండేషన్‌ 28వ సరస్వతి సమ్మాన్‌ వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో శివారెడ్డికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పురస్కారాన్ని ప్రదానం చేశారు. జ్ఞాపికతోపాటు అవార్డు కింద ఫౌండేషన్‌ ఇచ్చే రూ. 15 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ అధ్యక్షురాలు శోభనా భారతీయ, డా. సుభాష్‌ కశ్యప్‌ పాల్గొన్నారు. 

భాష సంస్కృతికి జీవనాడి: ఉపరాష్ట్రపతి 
భాష అనేది మన సంస్కృతికి జీవనాడి లాంటిదని ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు. భాష, సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించుకుంటే ప్రతి ఒక్కరి జీవితం ఫలప్రదం అవుతుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ కన్న తల్లిని, పుట్టిన ఊరిని, మాతృ భాషను ఎల్లప్పు డూ కాపాడుకోవాలన్నారు.  వైవిధ్యతలో తన సమన్వయాన్ని వ్యక్తం చేస్తూ శివారెడ్డి రచించిన ‘పక్కకి ఒత్తిగిలితే’కు పురస్కారం వరించడం సంతోషకరమన్నారు. భాష, సంస్కృతి పరిరక్షణకు కేకే బిర్లా ఎనలేని కృషి చేశారని, దేశవ్యాప్తంగా రచనా రంగాన్ని ప్రోత్సహించేందుకు పురస్కారాలు ప్రదానం చేస్తున్నారని కొనియాడారు.

మనిషికి జీవశక్తినిచ్చేది సాహిత్యం: శివారెడ్డి 
మనిషికి కావాల్సిన జీవశక్తిని ప్రసాదించేది సాహిత్యమని, జీవితం నుంచి వచ్చిన సాహిత్యమే తిరిగి జీవితాన్ని ఇస్తుందని కవి శివారెడ్డి అన్నారు. ఈ పురస్కారం తెలుగు భాషకు దక్కిందని, తనకు ఈ పురస్కారం ఇవ్వడంతో శ్రమ జీవులకు, కార్మిక వర్గాలకు గుర్తింపు వచ్చిందన్నారు. మరిచిపోయిన వాటిని గుర్తు చేయడం, జీవితానికి అవసరమైన వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంలో సాహిత్యం ప్రధానపాత్ర పోషిస్తుందన్నారు. గుంటూరు జిల్లాలో రైతు కుటుంబంలో జన్మించిన కె.శివారెడ్డి గత 40 ఏళ్లుగా సాహిత్య రంగంలో విశేష సేవలందిస్తున్నారు.  

మరిన్ని వార్తలు