ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌గా సర్ఫరాజ్‌ అహ్మద్‌

17 Dec, 2019 02:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు ప్రభుత్వం కీలకమైన ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ పదవిని కట్టబెట్టింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇప్పటివరకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు చూస్తుండగా, ఆయన్ను తప్పించి ఆ విభాగాన్ని సర్ఫరాజ్‌కు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సర్ఫరాజ్‌ ఇటీవల వార్తల్లో నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల వ్యయం విషయంలో తనకు వ్యతిరేకంగా సర్ఫరాజ్‌ బీజే పీ ఎంపీ బండి సంజయ్‌తో కలసి కుట్ర చేశారని జిల్లా మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించారు. దీనిపై ఆయన సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు  చేశా రు. ఈ వివాదం తర్వాత సర్ఫరాజ్‌కు కీలకమైన ఎక్సై జ్‌ శాఖ పోస్టు లభించడం గమనార్హం.

రెవెన్యూ కార్యదర్శిగా ‘బుసాని’
డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం అదనపు డైరెక్టర్‌ జనరల్‌ బుసాని వెంకటేశ్వర్లు ను రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న ఎ.అశోక్‌ను డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేసింది. జోగులాంబ–గద్వాల జిల్లా కలెక్టర్‌ కె.శశాంక కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. వనపర్తి జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతికి జోగులాంబ–గద్వాల జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

మరిన్ని వార్తలు