సంక్షోభంలో సర్కారీ విద్య

3 Mar, 2015 01:27 IST|Sakshi

ఏటా వేల కోట్ల రూపాయలు వృథా
 
 రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సర్వశిక్షా అభియాన్, మోడల్ స్కూళ్లు, సక్సెస్ స్కూళ్లు అంటూ సర్కారు ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నా.. బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, పలువురు ఉపాధ్యాయుల్లో లోపిస్తున్న అంకిత భావం, పర్యవేక్షణ వ్యవస్థ సరిగా లేకపోవడం, విద్యా బోధనను నిరంతరం సమీక్షించే యంత్రాంగం కరువుకావడం వంటివి ఈ దుస్థితిని తెచ్చిపెడుతున్నాయి.  అసలే అంతంత మాత్రంగా ఉన్న ప్రమాణాలు దీంతో మరింతగా దిగజారుతున్నాయి.
 
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి.. సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), మోడల్ స్కూల్స్, సక్సెస్ స్కూల్స్ ఇలా పేర్లతో ప్రభుత్వ పాఠశాలల కోసం పథకాలను అమలు
 చేస్తున్నాయి. వాటికోసం ఏటా దాదాపు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల కోట్ల వరకు వెచ్చిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో దాదాపు లక్షన్నర మందికి పైగా ఉపాధ్యాయులు
 పనిచేస్తున్నారు. కానీ సర్కారీ విద్య నిండా సమస్యలతోనే
 కొట్టుమిట్టాడుతోంది. కొంత మంది ఉపాధ్యాయుల్లో లోపిస్తున్న అంకిత భావం, విద్యా బోధనను నిరంతరం సమీక్షించే యంత్రాంగం దిక్కులేకపోవడం పరిస్థితిని మరింతగా దిగజారుస్తోంది. క్షేత్ర స్థాయిలో
 పాఠశాలల పనితీరును పర్యవేక్షించాల్సిన ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పోస్టులు ఏళ్లకేళ్లుగా ఖాళీగా ఉంటున్నాయి. వీటికితోడు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లడం, ఆర్థిక స్తోమత లేనివారు మధ్యలోనే బడి మానేయడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచి, డ్రాపవుట్స్‌ను తగ్గించేందుకు చొరవ చూపాల్సిన ఉపాధ్యాయులూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
 
 సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ పాఠశాలలు
 
 
 ఒకటుంటే మరోటి లేదు..
 కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులుంటే సరైన సంఖ్యలో ఉపాధ్యాయులు లేరు. టీచర్లు ఉంటే విద్యార్థుల్లేరు. ఇక పిల్లలు, టీచర్లు సరిపోయేలా ఉన్న చోట కూడా బోధన సరిగా అందడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన సక్రమంగా లేదని, విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించడంలో ఉపాధ్యాయులు విఫలమవుతున్నారని ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారుల తనిఖీల్లోనే వెల్లడైంది. టీచర్లేం చెబుతున్నారనే దానిపై నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ విద్యార్థుల డ్రాపవుట్స్‌ను నియంత్రించే చర్యలూ దిక్కులేవు. రాష్ట్రంలో ఒకటో తరగతిలో చేరిన వారు ఐదో తరగతికి వచ్చే సరికి 22.32 శాతం మంది బడిని వీడుతున్నారు. 8వ తరగతికి వచ్చే సరికి ఇది 32.56 శాతానికి పెరుగుతోంది. ఎస్సీ, ఎస్టీలైతే మరింత ఎక్కువగా బడిమానేస్తున్నారు.
 
 
 ఇలాగైతే పర్యవేక్షణ ఎలా?
 రాష్ట్రంలో మండల విద్యాధికారి (ఎంఈవో), జిల్లా ఉప విద్యాధికారి (డిప్యూటీ డీఈవో) పోస్టులన్నీ ఖాళీగా ఉండడంతో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడుతోంది.  మొత్తంగా 462 ఎంఈవో పోస్టులుండగా... వాటిలో 420 ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ డీఈవో పోస్టులు 67 ఉంటే.. అందులో 59 ఖాళీయే. అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, జెడ్పీ ఉన్నత పాఠశాలల పర్యవేక్షణకు ప్రస్తుతం ఉన్నది 50 మంది అధికారులే. ఇన్‌చార్జి ఎంఈవో బాధ్యతలను ప్రధానోపాధ్యాయులకు అప్పగించి నెట్టుకొస్తున్నారు.
 
 ‘సర్వీస్ రూల్స్’.. సమస్య?
 ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టులతో పాటు డైట్, బీఎడ్ కాలేజీల్లో లెక్చరర్లు, ఎస్‌సీఈఆర్టీలో ప్రొఫెసర్లు తదితర పోస్టులకు పదోన్నతుల విషయంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్ల మధ్య విభేదాలున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా పరిషత్ టీచర్లంతా స్థానిక సంస్థల పరిధిలోకి వస్తారని, తాము మాత్రమే ప్రభుత్వ టీచర్లమని... అందువల్ల ఎంఈవో, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ పోస్టులన్నీ తమవేనని ప్రభుత్వ టీచర్లు వాదిస్తున్నారు. కానీ మొత్తం పాఠశాలల్లో 95 శాతం ఉన్న పంచాయతీరాజ్ టీచర్లకు ఆ పోస్టుల్లో అవకాశం కల్పించాలని స్థానిక సంస్థల ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏకీకృత సర్వీసు రూల్స్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ఈ వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. దీన్ని సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆయా పోస్టుల భర్తీని పక్కనపెట్టింది.
 
 పరిష్కారం పట్టదా?
 ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు సంబంధించి కనీసం తాత్కాలిక ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను రూపొందించి.. పోస్టులను భర్తీ చేసే అవకాశం ప్రభుత్వం పరిధిలో ఉంది. దానితో పాటు పదోన్నతులు కాకుండా డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 30 శాతం డైట్ లెక్చరర్ పోస్టులనూ భర్తీ చేయవచ్చు. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించినా... చివరకు పక్కన పెట్టేసింది. ఇక సమాజంలో, విద్యా రంగంలో వస్తున్న మార్పులపై పరిశోధనలు చేస్తూ, ఉపాధ్యాయులకు శిక్షణ (ఇన్ సర్వీస్ ట్రైనింగ్) ఇవ్వాల్సిన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలిలోనే (ఎస్‌సీఈఆర్టీ) ప్రొఫెసర్లు, రీడర్లు, లెక్చరర్లు లేరు. ఇందులోని 32 పోస్టుల్లో 27 ఖాళీయే.
 
 విద్యార్థులు లేకున్నా టీచర్లున్న పాఠశాలలు.. 456
 10 మందిలోపే పిల్లలున్నా నలుగురు టీచర్లున్న పాఠశాలలు.. 180
 సరైన సంఖ్యలో టీచర్లుండీ 25 మందిలోపే విద్యార్థులున్న స్కూళ్లు..300
 
 విద్యార్థులున్నా ఒకే టీచర్ ఉన్న ప్రాథమిక పాఠశాలలు.. 3,895
 సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్న స్కూళ్లు.. 2,000
 బదిలీ అయినవారు వెళ్లిపోతే టీచర్లే ఉండని స్కూళ్లు.. 717
 
 ఆ పోస్టులకు మేమే అర్హులం
 డైట్ లెక్చరర్, ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టులకు ప్రభుత్వ టీచర్లు మాత్రమే అర్హులు. పంచాయతీరాజ్ టీచర్లు కూడా కేవలం ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టుల విషయంలోనే పట్టుదలతో ఉన్నారు. డైట్ లెక్చరర్ పోస్టుల విషయంలో పట్టింపుతో లేరు. ప్రభుత్వం తలుచుకుంటే వాటిని భర్తీ చేయవచ్చు. డైట్, బీఎడ్ కాలేజీల విద్యార్థులకు టీచింగ్ ప్రాక్టీస్ కోసమే ప్రభుత్వ స్కూళ్లను ఏర్పాటు చేశారు.’’    
 
 - వీరాచారి, ప్రభుత్వ టీచర్ల సంఘం అధ్యక్షుడు
 
 ఏకీకృత రూల్స్ తేవాల్సిందే
 ‘‘రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉమ్మడి సర్వీసు రూల్స్ తేవాలి. అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లతో పదోన్నతుల ద్వారా 70 శాతం పోస్టులను భర్తీ చేయాలి. కనీసం తాత్కాలిక సర్వీసు రూల్స్‌తోనైనా ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లతో ఎంఈవో, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ పోస్టులను భర్తీచేయాలి. 30 శాతం డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టుల భర్తీలో ఏ సమస్యా లేదు.’’
 - వెంకట్‌రెడ్డి, పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్షుడు
 
 ఎంఈవో, డిప్యూటీ డీఈవోల పరిస్థితి..

 

 


 

మరిన్ని వార్తలు