సరోగసీ మహిళ అదృశ్యం

7 Dec, 2017 03:44 IST|Sakshi

మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు

హైదరాబాద్‌: అద్దె గర్భాన్ని ధరించేందుకు సంతాన సాఫల్యతా కేంద్రానికి వచ్చిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. ఈ ఘటనపై హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లోని సాయికిరణ్‌ ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్‌లో సరోగసీ పద్ధతిలో అద్దె గర్భం దాల్చేందుకు మహిళలు కావాలంటూ ఆసుపత్రి సంచాలకుడు డాక్టర్‌ సమిత్‌ శేఖర్‌ అలియాస్‌ డాక్టర్‌ సాయి కిరణ్‌ నుంచి నరేశ్‌కుమార్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో తమ బంధువైన విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతానికి చెందిన లక్ష్మి(31)ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో తీసుకొచ్చి ఒప్పందం మేరకు ఇక్కడ ఉంచి సంబంధిత ధ్రువపత్రాలపై సంతకాలు కూడా చేశారు. అద్దె గర్భం ధరిస్తే రూ. 2.50 లక్షలు ఇస్తారంటూ చెప్పడంతో పేదరికంలో ఉన్న లక్ష్మి ఇందుకు అంగీకరించింది.

అప్పటి నుంచి వారి సంరక్షణలో ఉన్న లక్ష్మి వారం రోజుల నుంచి కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు దాచిపెట్టాయి. ఆమెను చూడటానికి వచ్చిన నరేశ్‌ రెండుసార్లు కలవడానికి యత్నించగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. లక్ష్మి కనిపించడం లేదంటూ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. కమిషన్‌ ఆదేశాలతో వైద్యాధికారులు సాయికిరణ్‌ ఫెర్టిలిటీ సెంటర్‌లో తనిఖీలు చేపట్టడంతోపాటు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో బంజారాహిల్స్‌ పోలీసులకు కేసు నమోదు చేయాల్సిందిగా ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు మిస్సింగ్‌ కింద కేసు నమోదు చేసి బుధవారం ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా