వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన సర్పంచ్‌

27 Oct, 2019 12:26 IST|Sakshi

శిలాఫలకంపై పేరు సక్రమంగా రాయలేదని.. 

ఐదు గంటల పాటు హల్‌చల్‌

డోర్నకల్‌: మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌ ప్రారంభోత్సవ శిలాఫలకంపై తన పేరు సక్రమంగా రాయకుండా అవమానించారంటూ మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం చిలుకోడు గ్రామ సర్పంచ్‌ స్థానిక వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. చిలుకోడు జీపీ పరిధి మోడల్‌ స్కూల్‌లో శనివారం హాస్టల్‌ భవనాన్ని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై తన పేరు తప్పుగా రాయడమే కాకుండా చివరన చిన్న అక్షరాలతో రాశారని ఆరోపిస్తూ సర్పంచ్‌ రాయల వెంకటేశ్వర్‌రావు ప్రారంభోత్సవానికి ముందే గ్రామంలోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కాడు. తనను అవమానించిన ఇద్దరు వ్యక్తులతో పాటు సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని, లేకుంటే తిక్కడి నుంచి దూకుతానని హెచ్చరించాడు.

సర్పంచ్‌కు మద్దతుగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగడంతో ట్రాఫక్‌ స్తంభించింది. సీఐ జె.శ్యాంసుందర్, ఎస్సై నాగభూషణం ట్యాంకు వద్దకు చేరుకుని సర్పంచ్‌తో మాట్లాడాడు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పినా ఒప్పుకోలేదు. సుమారు నాలుగు గంటల పాటు సర్పంచ్‌ ట్యాంక్‌పైనే ఉండగా గ్రామస్తులు రోడ్డుపై బైటాయించారు. మహబూబాబాద్‌ డీఎస్‌పీ నరేష్‌కుమార్‌ వచ్చి చెప్పినా ససేమిరా అనండంతో చివరకు సర్పంచ్‌ మద్దతుదారులతో పోలీసులు చర్చలు జరిపి అవమానించిన వారిపై ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటామని సూచించగా కిందకు దిగివచ్చిన సర్పంచ్‌ రాతపూర్వకగా ఫిర్యాదు అందజేశాడు.  

>
మరిన్ని వార్తలు