ఇక పంచాయతీ పోరు

10 Dec, 2018 12:19 IST|Sakshi

పల్లెలో బీసీ ఓటర్ల గుర్తింపు షురూ..

తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితాలతో లెక్కింపు

ఈనెల 13,14న ముసాయిదా జాబితా

15న తుది జాబితా ప్రచురణ

పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు షురూ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల జాతర ముగియడంతో ఇక పంచాయతీ జాతరకు అధికార యంత్రాంగం సమయత్తం అవుతోంది. డిసెంబర్‌ చివరి వారం వరకు పంచాయతీ ఎన్నికలు జరుపేందుకు ప్రభుత్వం నుంచి స్థానిక పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పంచాయతీ పాలకవర్గం గడువు గత జులైలో ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల కనుసన్ననల్లో పాలన కొనసాగుతుంది. దీంతో పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించి గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిపించాల్సిందిగా కోరారు. దీనికి అనుగుణంగా న్యాయస్థానం సైతం ఎన్నికలు జరిపించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లెక్కింపులో అధికారులు బిజీగా ఉండగా ఎన్నికల కమిషన్‌ గ్రామపంచాయితీలకు ఎన్నికలు జరిపించాల్సిందిగా సూచనలు జారీ అయ్యాయి. జిల్లాలో గతంలో 208 గ్రామపంచాయతీలు ఉండగా పెరిగిన లెక్కల ప్రకారం 263 గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. కొత్త గ్రామపంచాయతీలో పోటీ చేసేందుకు ఆయా గ్రామాలకు చెందిన కొత్త తరం నాయకులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు అందుకున్న జిల్లా పంచాయతీ అధికారులు బీసీ ఓటర్ల గుర్తింపులో లెక్కలు తేల్చేందుకు సిద్ధమయ్యాయి. గ్రామాల వారీగా బీసీ, ఎస్సీ ఓటర్లను తేల్చి ఆ తరువాత రిజర్వేషన్ల ప్రక్రియను ప్రకటించనున్నారు.
అయితే కొత్త ప్రభుత్వంలోనే ఈ వ్యవహరాలు కొలిక్కి రానున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లు పెద్దసంఖ్యలో పెరిగారు. గ్రామపంచాయతీ ప్రకారం తిరిగి ఓటర్లను విభజించి వార్డుల వారీగా గుర్తించే పనిలో ఉన్నారు. రిజర్వేషన్‌ లెక్కలు తేల్చిన తర్వాతే వార్డుల వారీగా రిజర్వేషన్లు, గ్రామాల వారీగా రిజర్వేషన్లను ప్రకటించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈనెల 13, 14 తేదీల్లో ముసాయిదా జాబితా, 15న పంచాయతీల్లో ఓటర్ల తుదిజాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యంతరాలు గ్రామస్థాయిలో స్వీకరించనున్నారు. 

పట్టణాల్లో నివాసం.. పల్లెల్లో పెద్దరికం..
గ్రామాల్లో సర్పంచ్‌గా పోటీ పడేందుకు ఆసక్తి చూపుతున్న ఉన్నత వర్గాలకు చెందినవారు పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ పల్లెల్లో అధికారం చెలాయిస్తున్నారు. ప్రస్తుతం జరుగనున్న సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆసక్తి చూపుతున్న వారిలో అగ్రవర్ణాలకు చెందిన వారు పట్టణ ప్రాంతాల్లో ఉంటూ సర్పంచ్‌గిరీపై కన్నెశారు. అలాంటివారు తిరిగి గ్రామాల్లోనే ఓటరు జాబితాలో పేరు మార్పిడి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక గ్రామాల్లో తమకు ప్రతికూలమైన వారిపేరు ఓటరు జాబితా నుంచి గతంలో తొలగించిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి జరుగనున్న ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా ఆన్‌లైన్‌లో భద్రపర్చడం ద్వారా ఎవ్వరికి వారు సొంతగా తమ పేరును ఓటరు లిస్టులో చూసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఓటర్లను తొలగించే కుట్రలకు అధికారులు తెరదింపినట్లు అయింది. 

ఇప్పటికే  విందులు.. 
గత జూన్‌లో సర్పంచుల పదవీకాలం ముగిసిన వెంటనే సర్పంచు ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం సూచనప్రాయంగా ప్రకటించడంతో సర్పంచ్‌ ఎన్నికల్లో పోలీచేసేందుకు సిద్ధపడిన పలువురు గ్రామస్తులను, చోటామోటా నాయకులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు  రూ.లక్ష నుంచి రూ2 లక్షల వరకు విందులకు ఖర్చు చేశారు. చివరికి రిజర్వేషన్ల ప్రక్రియ పేరుతో కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు ఆగిపోయాయి. దీంతో పెద్దఎత్తున నష్టపోయామంటూ పలువురు ఆశావాహులు ఆందోళన చెందారు. అయితే వాయిదాపడ్డ ఎన్నికలు తిరిగి జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల జోరు తుదివరకు చేరుకోకుండానే సర్పంచ్‌ ఎన్నికలు తెరపైకి రావడం మరోసారి గ్రామాల్లో జాతర వాతావరణం చోటుచేసుకుంటుంది. 

>
మరిన్ని వార్తలు