నోరు పారేసుకున్న సర్పంచ్‌ 

29 Sep, 2019 06:41 IST|Sakshi
ఇళ్లమధ్యన ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు

పనులు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడిన కనకమామిడి సర్పంచ్‌ 

ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆదేశాల మేరకు సర్పంచ్‌కు షోకాజ్‌ నోటీసు  

సాక్షి, రంగారెడ్డి: గ్రామాల్లో 30 రోజుల కార్యాచరణ అమలు తీరును తెలుసుకునేందుకు వెళ్లిన అధికారిపై మొయినాబాద్‌ మండలం కనకమామిడి సర్పంచ్‌ పట్లోళ్ల జనార్దన్‌రెడ్డి నోరు పారేసుకున్నారు. ప్రణాళికను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసిన ఆ అధికారికి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతోపాటు దుర్భాషలాడారు. కనకమామిడి పంచాయతీ అనుబంధ గ్రామం సజ్జన్‌పల్లిని శనివారం జిల్లా పంచాయతీ విభాగం ఉన్నతాధికారి ఒకరు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు ముళ్లపొదలు ఉన్నట్లు గుర్తించారు. గృహనిర్మాణ వ్యర్థాలు, శిథిలావస్థ ఇళ్ల  తొలగింపు తప్ప మరే ఇతర పనులను చేపట్టనట్లు కనబడింది. ఈ సమయంలో స్థానికంగా సర్పంచ్‌ అందుబాటులో లేకపోవడంతో సదరు అధికారి ఫోన్‌లో ఆయన్ను నిలదీశారు. ‘ఎవరు చెబితే మీరు గ్రామానికి వచ్చారో తెలుసు. నువ్వేం చేస్తున్నావో తెలుసు. మీ సంగతి అంతా గమనించిన’ అని సర్పంచ్‌ దురుసుగా మాట్లాడినట్లు తెలిసింది. దీనిపై ఘటనా స్థలం నుంచి సదరు అధికారి ఆవేదనతో ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌కు వివరించారు. దీంతో కలెక్టర్‌ స్పందిస్తూ.. సదరు సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని ఆ అధికారికి సూచించారు. తనిఖీకి వచ్చిన అధికారి పట్ల అమర్యాదగా మాట్లడటంతో ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆదేశాల మేరకు సర్పంచ్‌కు షాకాజ్‌ నోటీసులు జారీచేశారు. అలాగే 30 రోజుల ప్రణాళిక అమలులో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన పంచాయతీ సెక్రటరీ రవీందర్‌కు చార్జిమెమో ఇచ్చారు. దీనిపై సర్పంచ్‌ జనార్దన్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ అడిగేందుకు పలుమార్లు ఫోన్‌ చేయగా ఆయన స్పందించలేదు.

మరిన్ని వార్తలు