సర్పంచ్‌ల పాత్ర మారాలి

16 Jul, 2016 03:15 IST|Sakshi
సర్పంచ్‌ల పాత్ర మారాలి

- రాజకీయ పాత్ర కాదు.. సంక్షేమ పాత్ర అని చాటాలి: గవర్నర్ నరసింహన్
నాటిన మొక్కల్ని కాపాడాలి..లేదంటే జరిమానా విధిస్తా
- మెదక్ జిల్లాలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో ముఖాముఖి
 
 సిద్దిపేట : ‘‘సర్పంచ్ పాత్ర గ్రామంలో చాలా పెద్దది. ఈ రోజు నుంచి కొత్త కథ మొదలుకావాలి. ప్రజలందరినీ భాగస్వామ్యం చేసుకొని కలసి పనిచేయాలి. సర్పంచ్‌ది రాజకీయ పాత్ర కాదని, సంక్షేమ పాత్ర అని చాటాలి. బాధ్యతాయుతంగా ప్రజాసేవకే అంకితం కావాలి’’ అని గవర్నర్ నరసింహన్ సూచించా రు. శుక్రవారం మెదక్ జిల్లా సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో నాగుల బండ శివారులోని నర్సరీ వద్ద మంత్రి హరీశ్‌రావుతో కలసి ఆయన ముఖాముఖి నిర్వహించారు. ప్రజాప్రతినిధులను పరిచయం చేసుకొని వారితో ము చ్చటించారు.

హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కలు నాటారంటూ ప్రశ్నించారు. ‘‘మొక్కను నాటడమే కాదు. వాటిని పరిరక్షిం చడం ముఖ్యం. మొక్కల్ని కాపాడడంలో విఫలమైతే జరిమానా విధిస్తా. డిసెంబర్‌లో మొ క్కల లెక్క చూస్తా తక్కువగా ఉంటే జరిమా నా తప్పదు మరి’’ అని అన్నారు. సర్పంచ్ అనగానే రాజకీయాలు అనుకోవద్దని, సేవా, సంక్షేమ భావంతో పనిచేయాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తదితరులు పాల్గొన్నారు.

 సిద్దిపేట ఆసుపత్రి సూపర్
 ‘సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి రోగులు రావడం ఆశ్చర్యంగా ఉంది. అలా వస్తారా..? నిజమా!’ అంటూ గవర్నర్ నరసింహన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ కేంద్రం ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా పిల్లల వైద్యానికి సంబంధించిన పలు కేసులను ఇక్కడికి రిఫర్ చేస్తున్నారని వైద్యులు చెప్పడంతో గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు.
 
 రాజ్‌భవన్‌లో దోమలున్నాయి..
  ‘‘హైదరాబాద్‌లో, రాజ్‌భవన్‌లో దోమలున్నాయి. కానీ పారిశుధ్యంలో ఆదర్శంగా నిలిచిన ఇబ్రహీంపూర్ గ్రామంలో ఒక్క దోమ కూడా లేదు. ఇదే స్ఫూర్తితోనే రాజ్‌భవన్‌లో దోమల్లేకుండా కృషి చేస్తా. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఎమ్మెల్యే తన ప్రాంతంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలి. ఇందుకు చట్టం తీసుకురావాలి’’ అని గవర్నర్ అన్నారు. శుక్రవారం హరితహారంలో భాగంగా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ ఏర్పడి రెండేళ్లయింది. నన్ను సమావేశాలకు పిలుస్తారు. స్వీట్లు తినిపిస్తారు.. స్పీచ్ ఇస్తాను.. సన్మానిస్తారు.. కానీ ఇబ్రహీంపూర్‌లో పర్యటించాక జీవితంలోనే మధురమైన అనుభూతి కలిగింది’’ అని ఆనందం వ్యక్తంచేశారు.

అంతకుముందు ప్రజాప్రతినిధులతో కలసి మొక్కలు నాటారు. ‘‘రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణ అవుతుందో.. లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఇబ్రహీంపూర్ మాత్రం బంగారు గ్రామంగా రూపుదిద్దుకుంది. ఐక్యతతోనే ఈ అభివృద్ధి సాధించింది’’ అని గవర్నర్ అన్నారు. మరోవైపు గవర్నర్‌కు సిద్దిపేటలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏకాదశి భోజనాన్ని ఏర్పాటు చేశారు. పెసరట్టు, మిర్చి, సర్వపిండి, మక్కగారెలు, పులిహోర, క్యారెట్ హల్వా, సేమియా పాయసం, పప్పు, పన్నీరు, గుమ్మడి సాంబారు, వెజ్ బిర్యానీని వడ్డించారు.

మరిన్ని వార్తలు