ఏ రాష్ట్రంలోనూ లేని పద్ధతి తెలంగాణలో ఎందుకు?

24 Sep, 2019 18:48 IST|Sakshi
మాట్లాడుతున్న డీకే అరుణ

సాక్షి, ఢిల్లీ : తెలంగాణలో ఉమ్మడి చెక్‌ పవర్‌ ఇచ్చి ప్రభుత్వం సర్పంచ్‌లను అవమానిస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ ఆరోపించారు. మంగళవారం ఆమె నేతృత్వంలో తెలంగాణ సర్పంచ్‌ల ఫోరమ్‌ నాయకులు కేంద్రమంత్రి నరేందర్‌ సింగ్‌ తోమర్‌ను కలిశారు. సమావేశం అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. లక్షలు ఖర్చుపెట్టుకొని గెలిచిన సర్పంచ్‌తో సమానంగా ఉప సర్పంచ్‌కి చెక్‌ పవర్‌ ఇవ్వడం వల్ల గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయన్నారు. ఏమైనా పనులు చేయాలంటే ఉప సర్పంచులు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని, సర్పంచ్‌లు తీవ్ర మనస్తాపంతో ఉన్నారని ఆమె వెల్లడించారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా గ్రామాలకు నిధులు కేటాయించకపోవడంతో గ్రామాభివృద్ధి కుంటుపడిందని, గ్రామాలకోసం కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పడుతున్నాయని ఆమె విమర్శించారు. మేం చెప్పిన విషయాల పట్ల కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించిన మంత్రి, త్వరలో తెలంగాణలో పర్యటిస్తానని హామీ ఇచ్చారని తెలియజేశారు. తెలంగాణ సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్‌ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో ఉమ్మడి చెక్‌పవర్‌ ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద తమకు నమ్మకం లేదని, ఆయనవి మాటలే తప్ప చేతలు లేవన్నారు. 

>
మరిన్ని వార్తలు