క్షేత్రస్థాయి నేతలకు పార్టీల గాలం

7 Apr, 2019 03:10 IST|Sakshi

సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ఎంపీ అభ్యర్థుల మంతనాలు

గ్రామాల్లో ఓట్లన్నీ తమకే పడేలా చూడాలని బేరసారాలు

సాక్షి, హైదరాబాద్‌: పోలింగ్‌ గడువు దగ్గరపడుతున్నకొద్దీ అన్ని ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ఓట్లు రాల్చగల నేతలకు గాలం వేసే పనిలో పడ్డాయి. ముఖ్యంగా గ్రామాల్లో పట్టున్న సర్పంచ్‌లు, వార్డు సభ్యులతోపాటు గత ఎన్నికల్లో సర్పంచ్‌లుగా పోటీ చేసి ఓడిన నేతలను సైతం మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. కనీసం వంద నుంచి వెయ్యి ఓట్లను ప్రభా వితం చేయగల నేతలను గుర్తించి వారిని మచ్చిక చేసుకునే బాధ్యతను పార్టీలు నియోజకవర్గ నేతలకు అప్పగిస్తున్నాయి. వారితోపాటే కుల సంఘాల పెద్దలు, కార్మిక సంఘాల నేతలు, మహిళా సంఘాల నేతలతో పార్టీల అభ్యర్థులే నేరుగా మాట్లాడుతూ వారు కోరిన మేర హామీలు ఇస్తూ ఓట్లు రాబట్టుకునే పనిలో పడ్డారు. ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలన్న పట్టుదలతో ఉన్న నేతలు గ్రామాలవారీగా పట్టున్న నేతలు, సంఘ పెద్దలపై దృష్టి సారించారు. 

అందరూ కావాల్సిన వారే.. 
ఇటీవలి సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ముగ్గురు నుంచి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇందులో మెజారిటీ సర్పంచ్‌లు అధికార పార్టీ మద్దతుతో గెలిచినా ఓడిన అభ్యర్థుల్లోనూ చాలా మంది టీఆర్‌ఎస్‌ బలపరిచిన వారు ఉన్నారు. వారిలోనూ చాలా మందికి వందల సంఖ్యలో ఓట్లు వచ్చాయి. ఓడిన అభ్యర్థులను మచ్చిక చేసుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికార పార్టీ... ఓడిన అభర్థులపైనా దృష్టి పెట్టి పార్టీలో చేర్చుకుంటోంది. దీంతోపాటే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ సర్పంచ్‌లకు వివిధ హామీలు ఇస్తూ పార్టీలో చేర్చుకుంటోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభలకు ముందుగా నిర్వహిస్తున్న సభల్లోనే ఇతర పార్టీల సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు పార్టీ కండువాలు వేస్తోంది. ఇక కాంగ్రెస్‌ సైతం తమ పార్టీ సర్పంచ్‌లను కాపాడుకుంటూనే టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలను ఆకట్టుకునే పనిలో పడింది. వారితో ఆయా ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి నేతలతో మాట్లాడిస్తోంది. వారికున్న ఇబ్బందులను తెలుసుకుంటూ వాటిని తీరుస్తామంటూ అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. మహిళా సంఘాలకు గ్రామస్థాయిలో మహిళా భవనాలు, వాటిలో సౌకర్యాలతోపాటు తమకు అనుకూలంగా ఓటేసేందుకు ఏం కావాలో అడుగుతున్నారు. ఈ విషయంలో గ్రామ, మండలస్థాయి సంఘాల నాయకులతో మంతనాలు చేస్తున్నా రు.

మహిళా సంఘాలను మచ్చిక చేసుకొని తమవైపు ఓట్లు వేసుకునేలా ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటితోపాటే కూలి పనుల కోసం హైదరాబాద్‌లో ఉంటున్న వారికి గ్రామస్థాయి నాయకులు ద్వారా ఫోన్లు చేయిస్తున్నారు. ఓటుకు రూ. 2 వేలు ఇవ్వడంతోపాటు పోలింగ్‌ రోజున ప్రయాణ ఖర్చులు భరిస్తామని హామీ ఇస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఓటర్లకు సమాచారం చేరవేస్తున్నారు. చేవెళ్ల, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌ నియోజకవర్గాల లోక్‌సభ అభ్యర్థులు ఇలాంటి ప్రచారంలో ముందున్నారని తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు