‘హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో 251 నామినేషన్లు’

26 Sep, 2019 20:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచ్‌ల సంఘం నుంచి 251 మంది సర్పంచ్‌లు నామినేషన్‌ వేసి పోటీ చేస్తారని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదామి భూమన్నయాదవ్‌ వెల్లడించారు. సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌లపై ప్రభుత్వం చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఉప ఎన్నికల్లో సర్పంచ్‌ల సంఘం పోటీ చేస్తుందని తెలిపారు. ‘హలో సర్పంచ్‌ చలో హుజూర్‌నగర్‌’ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ నెల 29, 30 తేదీల్లో 251 మంది సర్పంచ్‌లు నామినేషన్‌ దాఖలు చేస్తారని వెల్లడించారు. ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌ను రద్దు చేయాలని, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన 29 అంశాలను స్థానిక సంస్థలకు బదిలీ చేయాలని సీఎం కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా అమలు చేయలేదని ఆరోపించారు. ఇటీవల బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ సారధ్యంలో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్, జి.కిషన్‌రెడ్డిలను కలిసి గ్రామ సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించామని చెప్పారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో సంఘం నేతలు జూలూరి ధనలక్ష్మి, పి.ప్రణీల్‌చందర్, మల్లేష్‌ ముదిరాజ్, శ్రీరాంరెడ్డి, ఎం.యాదన్న యాదవ్, బి.శంకర్‌ తదితరులు ఉన్నారని ఆయన తెలిపారు. (చదవండి: హలో సర్పంచ్... చలో హుజూర్ నగర్)

మరిన్ని వార్తలు