జీపీ భవనాలకు అదనపు నిధులు

19 May, 2018 08:37 IST|Sakshi

ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న భవనాలకు రూ. 3 లక్షల చొప్పున.. 

గతంలో ఒక్కో భవనానికి రూ. 13 లక్షల కేటాయింపు 

పెరిగిన అంచనా వ్యయం  

అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు

మోర్తాడ్‌(బాల్కొండ) : ఉపాధి హామీ పథకం ద్వారా నిధులను కేటాయించి నిర్మిస్తున్న పంచాయతీలకు అదనంగా మరిన్ని నిధులను కేటాయించాలని ఇంజినీరింగ్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఒక్కో భవనానికి రూ. 3 లక్షల చొప్పున కేటాయించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరుకున్న పంచాయతీ భవనాలకు కొత్త భవనాలను నిర్మించడానికి ఉపాధి హామీ పథకం నుంచి రూ. 13 లక్షల చొప్పున కేటాయించారు. అయితే ఈ నిధులతో భవన నిర్మాణం పూర్తయినా చిన్న చిన్న సౌకర్యాలను కల్పించడానికి నిధులు సరిపోకపోవడంతో పంచాయతీ భవనాలు వినియోగంలోకి రాలేకపోయాయి. అదనంగా నిధులు కేటాయిస్తేనే పనులు పూర్తి చేసి భవనాలను వినియోగంలోకి తీసుకురావచ్చని అధికారులు భావించారు. జిలాŠోల్ల మొదటి విడతలో కొన్ని భవనాలను నిర్మించగా అప్పట్లో ఒక్కో భవనానికి రూ. 11 లక్షల చొప్పున నిధులను కేటాయించారు. నిర్మాణ వ్యయం తక్కువగా ఉండడంతో నిధులు సరిపోయాయి.

అయితే 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో మరో 52 పంచాయతీలకు నూతన భవనాలను నిర్మించడానికి నిధులు మంజూరు చేశారు. నిర్మాణ వ్యయం పెరగడంతో ఒక్కో పంచాయతీ భవనానికి రూ. 13 లక్షల చొప్పున జిల్లాలోని 52 భవనాలకు రూ. 6 కోట్ల 76 లక్షలను కేటాయించారు. భవనాల నిర్మాణం పూర్తయినా సానిటేషన్, ఫ్లోరింగ్, కలర్స్‌ వేయడానికి నిధులు సరిపోలేదు. అంచనాలకు మించి వ్యయం పెరిగిపోవడంతో అదనంగా మరింత నిధులు అవసరం అని ఇంజినీరింగ్‌ అధికారులు గుర్తించారు. ఒక్కో పంచాయతీకి రూ. 3 లక్షల చొప్పున కేటాయిస్తే నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకురావచ్చని అధికారులు సూచిస్తున్నారు. సానిటేషన్, ఫ్లోరింగ్, కలర్స్‌ కోసం రూ. 3 లక్షల చొప్పున జిల్లాలోని 52 భవనాలకు రూ. 1.56 కోట్ల నిధులు అదనంగా అవసరం అవుతున్నాయి.

ఈ నిధులను కేటాయిస్తే జిల్లాలోని పంచాయతీ భవనాల కోసం ఉపాధి హమీ పథకం ద్వారా రూ. 8.32 కోట్లు కేటాయించినట్లు జరుగుతుంది. ప్రభుత్వమే అదనపు నిధులను విడుదల చేయడానికి ప్రతిపాదనలు కోరగా ఇంజినీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ నిధులు తొందరలోనే విడుదల అవుతాయని నిధుల కేటాయింపు జరగగానే పంచాయతీ భవనాలను వినియోగంలోకి తీసుకు రావడానికి పనులను పూర్తి చేయిస్తామని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు వెల్లడించారు.

అదనపు నిధులు కేటాయించడం సబబే..
గ్రామ పంచాయతీ భవనాలకు అదనంగా రూ. 3 లక్షల చొప్పున నిధులను కేటాయించడం సబబే. రూ. 13 లక్షలతో భవన నిర్మాణం పూర్తి కాగా ఇతర సౌకర్యాల కోసం అదనంగా నిధులు అవసరం ఉన్నాయి. పంచాయతీలకు ఆదాయం తక్కువగా ఉండడంతో ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించడం సమంజసమే.   – నాగం పోశన్న, సర్పంచ్, వడ్యాట్‌

నిధులు మంజూరైతేనే భవనాలు వినియోగంలోకి
ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా కేటాయించిన రూ. 13 లక్షల నిధులతో భవనాలను నిర్మించారు. కానీ సౌకర్యాలు మెరుగుపడలేదు. ఇప్పుడు రూ. 3 లక్షల అదనపు నిధులు మంజూరైతే సౌకర్యాలు వృద్ధి చెంది భవనాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తాయి.
లింగన్న, సర్పంచ్, దోన్‌పాల్‌  

మరిన్ని వార్తలు