కేసీఆర్‌ అన్నట్లు కాంగ్రెసోళ్లు ఇడియట్లే: సర్వే

7 Jan, 2019 14:27 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న సర్వే సత్యనారాయణ

 ఉత్తమ్‌, కుంతియా ముఖం చూసే ఓట్లు వెయ్యలేదు

ఇంకా పదవులు పట్టుకుని వేళాడుతారా?

టీ కాంగ్రెస్‌ నేతలపై సర్వే ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నట్లు కాంగ్రెస్‌ నేతలు నిజంగానే ఇడియట్లే అని ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఏఐసీసీ సభ్యుడైన తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే అధికారం టీపీసీసీకి ఎవ్వరిచ్చారని, సస్పెండ్‌ కాపీని చూపించే దమ్ము పీసీస నేతలకు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిపోయి ఇంకా పదవులను పట్టుకుని వేళాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. గత ఎన్నికల్లో తనను, మల్లు భట్టి విక్రమార్కను ఓడించాలని ఉత్తమ్‌ ప్రయత్నించారని సర్వే ఆరోపించారు.

కాగా, టీపీసీపీ నేతలను దూషించిన కారణంగా కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ సర్వే సత్యనారాయణను ఆదివారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గూడూరు నారాయణ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు గతంలో దిగ్విజయ్‌ సమక్షంలోనే కొట్టుకున్నారని అప్పుడు వారినెందుకు పార్టీ నుంచి తొలగించలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలపై ఎవరు సమీక్ష చేయమన్నారని అడిగినందుకే తనను సస్పెండ్‌ చేశారని తెలిపారు. కొల్లాపూర్‌, కోదాడ, పాలేరు, హుజూరాబాద్‌ టికెట్లును ఉత్తమ్‌ కుమార్‌ అమ్ముకున్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తమ్‌పై కేసులు ఉన్నందుకే కేసీఆర్‌కు లొంగిపోయాడని ఆరోపించారు.

సర్వే మాట్లాడుతూ.. ‘ఉత్తమ్‌, కుంతియా హఠావో.. కాంగ్రెస్‌ బచావో అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మొత్తం ప్రక్షాళన జరగాలి.  ఎమ్మెల్యేలు మారినా, మండలి ఎల్పీ టీఆర్‌ఎస్‌లో విలీనమైన ఉత్తమ్‌ పట్టించుకోరా?. 2014లో కాంగ్రెస్‌ ఓడితే అందుకు బాధ్యత వహిస్తూ.. పీసీసీ చీఫ్‌ పదవికి పొన్నాల రాజీనామా చేశారు. మరి ఇప్పుడు ఉత్తమ్‌ ఎందుకు పీసీసీ అధ్యక్ష పదవికి ఎందుకు రాజీనామా చెయ్యరు. నేను గెలిస్తే సీఎం పదవికి పోటీ అవుతాననే భయంతో నన్న ఓడించాలని ఉత్తమ్‌ చాలా ప్రయత్నాలు చేశారు. ఉత్తమ్‌, కుంతియా ముఖాలను చూసి ఎవ్వరూ ఓట్లు వెయ్యలేదు. లోక్‌సభ ఎన్నికల గెలుపు కోసం కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తుంటే, వీళ్లు ఇంకా సమీక్షలంటూ కాలక్షేపం చేస్తున్నారు. కేసీఆర్‌ అన్నట్ల వీళ్లు నిజంగానే ఇడియట్లు. అందరూ కలిసి పార్టీని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. త్వరలోనే నా సస్పెన్షన్‌పై అధిష్టానాన్ని కలుస్తా. నన్ను తప్పించిన వాళ్ల భరతం పడతాన’ని వ్యాఖ్యానించారు.

నన్నే సస్పెండ్‌ చేస్తారా.. మీ భరతం పడతా: సర్వే

మరిన్ని వార్తలు