శాతవాహన యూనివర్సిటీ ‘పట్టా’పండుగ 

15 Jul, 2019 10:43 IST|Sakshi

త్వరలో ‘శాతవాహన’  తొలి స్నాతకోత్సవం

గవర్నర్‌ కార్యాలయం నుంచి వీసీకి లేఖ

సాక్షి, శాతవాహనయూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం కల నెరవేరనుంది. యూనివర్సిటీ ఏర్పడిన దశాబ్దం దాటినా స్నాతకోత్సవం జరగలేదు. చాలాసార్లు అధికారులు ప్రయత్నించినా వివిధ కారణాలతో కుదరలేదు. తాజాగా గవర్నర్‌ కార్యాలయం నుంచి స్నాతకోత్సవ నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో ఆగస్టు మొదటి వారంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2017 వరకు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు ఈనెల 31 తేదీ వరకు కాన్వకేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించినట్లు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఉమేష్‌కుమార్‌ వెల్లడించారు.  
పలుమార్లు ప్రయత్నాలు..శాతవాహన యూనివర్సిటీలో స్నాతకోత్సవం నిర్వహించాలని చాలాసార్లు అధికారులు  ప్రయత్నించారు.

కానీ వివిధ కారణాలతో కుదరలేదు. వీరారెడ్డి వీసీగా పనిచేస్తున్నప్పడు 2014లో నిర్వహించేందుకు ప్రయత్నించినా ప్రత్యేక తెలం గాణ ఉద్యమం తీవ్రతరం కావడంతో అప్పుడు  అటకెక్కింది. 2015 నుంచి 2017 వరకు బి.జనార్దన్‌రెడ్డి ఇన్‌చార్జీ వీసీగా ఉన్నప్పుడూ మరోసారి స్నాతకోత్సవం జరుపాలని నిర్ణయించారు. వివిధ కారణాలతో ఆగిపోయింది. ఆ తర్వాత ఇన్‌చార్జి వీసీగా 2018 ఆగస్టు 30 నుంచి టి.చిరంజీవులు కొనసాగుతున్న క్రమంలో ఆదిలో స్నాతకోత్సవ ప్రయత్నాలు కొనసాగినా కార్యరూపం దాల్చలేదు. రిజిస్ట్రార్‌గా ఉమేష్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్నాతకోత్సవం నిర్వహణకు కసరత్తు తీవ్రంగా కృషిచేశారు. ఫలితంగా పలుమార్లు వాయిదా పడుతూ చివరకు ఆగస్టు మొదటి వారంలో నిర్వహిం చాలని శాతవాహన అధికారులు భావిస్తున్నారు. 

గవర్నర్‌  పచ్చజెండా..
రాష్ట్ర గవర్నర్‌ శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించడానికి పచ్చజెండా ఊపారు. దీనికి సంబందించిన లేఖ గవర్నర్‌ కార్యాలయం నుంచి శాతవాహన యూనివర్సిటీ వీసీకి అందించినట్లు సమాచారం. ఇంత వరకు స్నాతకోత్సవం నిర్వహించని శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం విషయంలో వివిధవర్గాల నుంచి అపవాదు ఎదుర్కొంది. ఈ విషయంపై వివిధ సామాజిక సంఘాలు, పార్జీలు, విద్యార్థిసంఘాలు, పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు, ఉన్నతాధికారులకు విజ్ఞప్తుల ప్రక్నియ కొనసాగుతూ వచ్చింది. గవర్నర్‌ నుంచి లేఖ రావడంతో మార్గం సుగమమై ఆగస్టు మొదటి వారంలో నిర్వహించడానికి అధికారులు సన్నద్ధం చేస్తున్నారు.

జూలై 31 వరకు దరఖాస్తులు...
శాతవాహన యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి 2017 వరకు డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు స్నాతకోత్సవం పట్టా పొందడానికి దరఖాస్తులు చేసుకోవచ్చని రిజిస్ట్రార్‌ ఉమేష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 తేదీ వరకు గడువు ఉందని, అర్హులందరూ శాతవాహన యూనివర్సిటీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. స్నాతకోత్సవం నిర్వహించడంపై శాతవాహన యూనివర్సిటీ వర్గాల్లో చాలా రోజుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇన్‌చార్జి వీసీ ఉండగా స్నాతకోత్సవం అవసరమా అని కొన్నివర్గాలు అభిప్రాయం వ్యక్తం చేయగా... కొద్ది రోజుల్లోనే రెగ్యులర్‌ వీసీని నియమించాలని దరఖాస్తులు కూడా ప్రభుత్వం కోరిందని, రెగ్యులర్‌ వీసీ వచ్చాక స్నాతకోత్సవం జరుపాలని మరికొన్నివర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా గవర్నర్‌ కార్యాలయం నుంచి స్నాతకోత్సవంపై సముఖత వ్యక్తం చేస్తూ లేఖ రావడంతో శాతవాహన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి సన్నద్ధమవుతోంది.

మరిన్ని వార్తలు