సత్తుపల్లి నుంచి ముగ్గురు 

14 Mar, 2019 15:51 IST|Sakshi
జలగం వెంగళరావు,  పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  జలగం కొండలరావు

జలగం కొండలరావు, జలగం వెంగళరావు  చెరో రెండుసార్లు ఎన్నిక

2014లో ఖమ్మం ఎంపీగా గెలిచిన  పొంగులేటి శ్రీనివాసరెడ్డి  

సత్తుపల్లి: సత్తుపల్లి కేంద్రంగానే ఖమ్మం జిల్లా రాజకీయాలు నెరపటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రాంతం నుంచి ముగ్గురు ఎంపీగా పోటీ చేసి గెలుపొందటం కూడా విశేషం. జలగం కొండలరావు(1977–1984), జలగం వెంగళరావు(1984–1991 వరకు), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(2014–2019 వరకు) ఖమ్మం ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. జలగం కొండలరావు, జలగం వెంగళరావు వరుసగా రెండు సార్లు ఖమ్మం ఎంపీగా పని చేశారు. జలగం వెంగళరావు, జలగం కొండలరావుల స్వగ్రామం పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కల్లూరు మండలం నారాయణపురం స్వగ్రామం. రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో కేంద్ర పరిశ్రమల శాఖామంత్రిగా జలగం వెంగళరావు పని చేశారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రి, హోంమంత్రిగా పని చేసిన  విషయం పాఠకులకు విదితమే. జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా తనదైన ముద్రవేశారు.  

జలగం కుటుంబానిది ప్రత్యేకస్థానం 
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో జలగం కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. జలగం వెంగళరావు అంటే ఠక్కున గుర్తుకువచ్చేది నాగార్జునసాగర్‌ ఎడమకాలువ నిర్మాణం. నక్సలైట్ల ఉద్యమాన్ని కఠినంగా అణచివేశారని విమర్శలు కూడా ఉన్నాయి. పాల్వంచ, భద్రాచలంలో పరిశ్రమల స్థాపన ఆయన హయాంలోనే జరిగింది. అదీగాక జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, జిల్లా పరిషత్‌ లాంటి ప్రధాన కార్యాలయాన్ని జలగం వెంగళరావు హయాంలోనే నిర్మించారు. జలగం వెంగళరావుతో పాటు ఆయన తమ్ముడు జలగం కొండలరావు, కుమారులిద్దరు జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావు రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. ప్రస్తుతం జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావు టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నారు.

బంగారు పళ్లెంలో.. 
జలగం వెంగళరావు బహిరంగ సభలంటే ఈ ప్రాంతంలో ఒక జోష్‌ ఉంటుంది. ఆయన మాటతీరు.. వాగ్బాణాలతో ఆకట్టుకుంటారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్‌రెడ్డిపై చేసిన విమర్శ ఇప్పటికీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గానే ఉంది. ‘ఎన్టీఆర్‌కు బంగారు పళ్లెం’లో అధికారాన్ని అప్పగిస్తారని ఖమ్మం బహిరంగ సభలో జలగం వెంగళరావు చేసిన వ్యాఖ్య రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కుకుండా పోవటంతో జలగం వెంగళరావు చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభివర్ణించారు.  

జగనన్న మనిషిగా వచ్చా.. 
పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లో వేగంగా వచ్చారు. ఆయన 2014 ఎన్నికల్లో ఎక్కడికి వెళ్లినా ‘నేనమ్మా.. జగనన్న మనిషిని’ రాజశేఖర రెడ్డి గారి పార్టీ అంటూ ప్రజల్లోకి దూసుకొచ్చారు. తొలి ప్రయత్నంలోనే వైఎస్‌ఆర్‌ సీపీ నుంచి ఖమ్మం ఎంపీ అయ్యారు. మారిన రాజకీయ పరిణామాలలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరు కన్పించినా.. చేతులెత్తి నమస్కారం చేయటం ఆయన మేనరిజంగా చెప్పుకుంటారు.
 

మరిన్ని వార్తలు