మెజారిటీపై మరింత విశ్వాసం

6 Apr, 2019 17:41 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌

సాక్షి,మహబూబాబాద్‌: సీఎం సభ సక్సెస్‌తో అభ్యర్థి మెజార్టీ పై మరింత విశ్వాసం పెరిగిందని ఎమ్మెల్సీ, పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సత్యవతిరాథోడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నూతన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.మానుకోటలో జరిగిన సీఎం సభలో మెడికల్‌ కళాశాలతోపాటు పలు విషయాలపై స్పందించి హామీ ఇచ్చారన్నారు. పోడు భూముల సమస్య కూడా పరిష్కరిస్తామని సీఎం ప్రకటించారని, పోడు రైతులు అర్థం చేసుకుని టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు.

సమష్టిగా కృషి చేయడంతో సభ సక్సెస్‌ అయ్యిందని, అలాగే అభ్యర్థి గెలుపు విషయంలోనూ కలిసి పనిచేసి సీఎం చెప్పిన విధంగా 3.50లక్షల మెజార్టీతో గెలిపించి సీఎంకు కానుకగా ఇవ్వాలన్నారు. ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ మాట్లాడుతూ టికెట్‌ రాలేదనే మనోవేదన సీఎం సభ కంటే ముందు ఉండేదని, సభలో సీఎం తనను మచ్చలేని నాయకుడని, కొన్ని సమీకరణల్లో టికెట్‌ ఇవ్వలేకపోయామని తనపై ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎంపీ అభ్యర్థి కవిత గెలుపు కోసం శాయశక్తులా కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. 16 మంది ఎంపీలను గెలిపించుకుంటే కేంద్రంలో బలం పెరిగి ఎక్కువ నిధులు మంజూరు చేయించుకునే అవకాశం ఉందన్నారు.

ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాల, ఇంజినీరింగ్‌ కళాశాల, హార్టికల్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉందని, ఆ విషయాలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఎంపీ అభ్యర్థికి మానుకోట నియోజకవర్గం నుంచి 50వేల మెజార్టీ ఇస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో నాయకులు మార్నేని వెంకన్న, పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ నెహ్రూ, రంగన్న, డోలి లింగుబాబు, యాళ్ల మురళీధర్‌రెడ్డి, నాయిని రంజిత్, ఆదిల్, యాళ్ల పుష్పలత, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు