కుంభమేళాలో పాల్గొనండి 

30 Dec, 2018 03:00 IST|Sakshi

తెలంగాణ ప్రజలకు యూపీ మంత్రి సతీశ్‌ మహాన్‌ ఆహ్వానం 

సాక్షి ,హైదరాబాద్‌: ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాలో పాల్గొనాలంటూ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రాథమిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి సతీశ్‌ మహాన్‌ తెలంగాణ ప్రజలను ఆహ్వానించారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌ బంజారాలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. యునెస్కో వారసత్వపు హోదా పొందిన కుంభమేళాకు దేశంలోని గ్రామ గ్రామాల నుంచి ప్రజలు వస్తారని తాము ఆశిస్తున్నామన్నారు. అలాగే అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలను వ్యక్తిగతంగా కలసి ఆహ్వానిస్తున్నామని మహాన్‌ తెలిపారు. ఆధ్యాత్మికం, ప్రభుత్వం ఏకతాటిపై నడుస్తూ నిర్వహిస్తున్న కార్యక్రమం ఇదనీ, మేళా విజయవంతానికి ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పూర్తి సహకారం అందిస్తున్నారని మంత్రి వెల్లడించారు.

గతం కంటే మిన్నగా ఏర్పాట్లు 
రూ.ఐదు వేల కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అన్ని రకాల వసతులు గతం కన్నా మిన్నగా సమకూర్చినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ (ప్రాథమిక సదుపాయాలు, ప్రారిశ్రామికాభివృద్ధి) రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ తెలిపారు. జనవరి 15న ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమయ్యే కుంభమేళా మార్చి 4వరకు జరుగుతుందన్నారు. ముఖ్యమైన మౌని అమవాస్య రోజున 4 కోట్లమంది భక్తులు పాల్గొనవచ్చని, మొత్తం మేళా పూర్తయ్యేనాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరవచ్చన్నారు. ప్రతీరోజూ ప్రయాగలో 7 క్యూసెక్కుల నీరు ఉండేలా చూస్తున్నామని, మౌని అమావాస్య మొదలు 5 ముఖ్యమైన కుంభమేళా రోజుల్లో 8 క్యూసెక్కుల నీరు ఉంటుందని రాజేశ్‌ కుమార్‌ తెలిపారు. అందరూ కలసి పాల్గొనే వీలున్న ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు వినియోగించుకోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏటిఓ చైర్మన్‌ రంగారెడ్డి, ఫిక్కీ తెలంగాణ కౌన్సిల్‌ సాంస్కృతిక కమిటీ చైర్‌పర్సన్‌ ప్రశాంత్‌ లహోటి పాల్గొన్నారు.  

గవర్నర్‌ , కేటీఆర్‌ను ఆహ్వానించిన యూపీ సర్కార్‌ 
కాగా కుంభమేళాలో పాల్గొనాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావును యూపీ ప్రభుత్వం ఆహ్వానించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సతీష్‌ మహాన శనివారం రాజ్‌భవన్, ప్రగతిభవన్‌లను సందర్శించి గవర్నర్‌ నరసింహన్, కేటీఆర్‌లకు ఆహ్వానలేఖలను అందించారు.

మరిన్ని వార్తలు