భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు పరిశోధనలు

9 Mar, 2018 03:51 IST|Sakshi

సెమీకండక్టర్లపై అంతర్జాతీయ సదస్సులో జి.సతీశ్‌రెడ్డి  

ఈ–వేస్ట్‌ సమస్యపై సీమెట్‌ కృషికి అభినందనలు

సాక్షి, హైదరాబాద్ ‌: దేశ భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను చేపట్టాలని రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్‌ రంగంలో దేశం అవసరాలు పెరుగుతున్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో ఏయే టెక్నాలజీలు, తయారీ పద్ధతులు, పదార్థాలు అవసరమవుతాయో గుర్తించి, వాటిని సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాలని సూచించారు.

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ)లో గురువారం సెమీకండక్టర్లపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతున్న కొద్దీ దేశంలో ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల సమస్య కూడా ఎక్కువవుతోందని.. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెక్నాలజీ (సీమెట్‌) ఈ వ్యర్థాల రీసైక్లింగ్‌కు టెక్నాలజీలను అభివృద్ధి చేస్తుండటం అభినందనీయమన్నారు.

దేశ రక్షణ రంగంలో కీలకమైన క్షిపణులతో పాటు అనేక ఇతర రంగాల్లో సీమెట్‌ ఆవిష్కరణలు ఉపయోగపడుతున్నట్లు తెలిపారు. ఏ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలోనైనా అందుకు తగ్గ పదార్థాలను గుర్తించి, తయారు చేయడం కీలకమని కేంద్ర ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారు ఆర్‌.చిదంబరం అన్నారు. సీమెట్‌ అభివృద్ధి చేసిన అనేక టెక్నాలజీలు, పదార్థాలు టెక్నాలజీ రంగంలో దేశం స్వావలంబన సాధించేందుకు ఉపయోగపడ్డాయని కొనియాడారు.

త్వరలో పీసీల్లోని ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులను రీసైక్లింగ్‌ చేసే పని మొదలవుతుందని తెలిపారు. ఈ–వేస్ట్‌ నుంచి మరింత చౌకైన పద్ధతుల్లో వనరులను రీసైకిల్‌ చేసే ప్రక్రియలను అభివృద్ధి చేయాలని కోరారు. 2020 నాటికి కార్ల విడిభాగాల నుంచి ఏటా 1.8 లక్షల టన్నుల అల్యూమినియం వృథా అవుతుందన్న అంచనాలున్నాయని.. ముడి అల్యూమినియం సేకరణ, తయారీ కంటే విడిభాగాల రీసైక్లింగ్‌ ద్వారా చౌకగా వెలికి తీయొచ్చని చెప్పారు.

మరిన్ని వార్తలు