మిత్రులు..ప్రత్యర్థులు..

24 Nov, 2018 10:20 IST|Sakshi

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నానుడి. సత్తుపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు ఈ కోవలోకే వస్తాయి. సుదీర్ఘకాలంలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఒకే పార్టీలో చేరడం, ఒకే వేదిక మీదకు వచ్చి మాట్లాడటం.. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవటం.. రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. 

సాక్షి, సత్తుపల్లి: టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే, సత్తుపల్లి కూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్‌ పాలేరులో మూడు సార్లు, సత్తుపల్లిలో రెండుసార్లు.. మొత్తం 5 సార్లు ప్రత్యర్థులుగా తలపడ్డారు. పాలేరులో సంబాని రెండుసార్లు, సండ్ర ఒకసారి గెలిచారు. 2009 పునర్విభజనలో సత్తుపల్లి నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్‌ చేశారు. ఇక్కడ రెండుసార్లు వెంకటవీరయ్యే విజయం సాధించారు. 2018లో సీన్‌మారిపోయింది. రెండున్నర దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా తలపడిన సంభాని చంద్రశేఖర్,సండ్ర వెంకటవీరయ్యలు ప్రజాకూటమి పేరుతో మిత్రులుగా ఒక్కటయ్యారు.ఇద్దరు ఒకే వేదికను పంచుకోవటం రాజకీయ వర్గాలలో చర్చానీయాంశమైంది.
సండ్ర–సంబాని .. 

టీడీపీలో తుమ్మల నాగేశ్వరరావుతో సండ్ర వెంకటవీరయ్యకు సాన్నిహిత్యం ఉండేది. 2009 ఎన్నికల్లో సండ్ర వెంకటవీరయ్యను సత్తుపల్లి టీడీపీ నేతలకు పరిచయం చేసి గెలిపించా ల్సిన బాధ్యతను భుజస్కంధాలపై పెట్టారు. ఆనాటి నుంచి ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. 2014 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య ఒక్కరే గెలిచారు. ఖమ్మంలో తుమ్మల ఓటమి చెందారు. అనంతరం ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి పదవి చేపట్టారు. తుమ్మ ల నాగేశ్వరరావును సండ్ర వెంకటవీరయ్య అనుసరించక పోవటంతో ఇద్దరి మధ్య రాజకీయ విబేధాలు తలెత్తాయి. 2018 ఎన్నికల్లో సండ్రకు వ్యతిరేకంగా తుమ్మల అనుచరులు టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నారు. ఒకప్పుడు అందరు కలిసి వ్యూహా లు రచించినవారు ఇప్పుడు వైరి పక్షంగా మారారు.
తుమ్మల–సండ్ర ..

 

తుమ్మల–జలగం ..

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావులకు దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది. సత్తుపల్లిలో టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నుంచి జలగం ప్రసాదరావు రెండుసార్లు తలపడ్డారు. ఒకసారి తుమ్మల, ఒకసారి ప్రసాదరావు గెలిచారు. ప్రస్తుతం వీరిద్దరూ టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. తుమ్మలపై జలగం ప్రసాదరావు సోద రుడు జలగం వెంకటరావు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో సత్తుపల్లి ఎస్వీ రిజర్వ్‌గా మారడంతో వీరిద్దరూ మరోసారి ఖమ్మంలో తలపడ్డారు. జలగం వెంకటరావు(ఇండిపెండెంట్‌)పై తుమ్మల విజయం సాధించారు. అనంతర పరి ణామాల్లో 2014 సాధారణ ఎన్నికల కంటే ముందే జలగం వెంకటరావు టీఆర్‌ఎస్‌ లో చేరారు. కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2015లో తుమ్మల కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో జలగం వెంకటరావుతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఇటీవలే మాజీ మంత్రి జలగం ప్రసాదరావు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉన్న జలగం సోదరులు, తుమ్మల నాగేశ్వరరావు ఒకే పార్టీలో ఒకే వేదికను పంచుకోవటం రాజకీయ విశ్లేషణకు దారితీసింది. 2014 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు అందరు కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగటం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది. 
 

మరిన్ని వార్తలు