సత్య నాదెళ్ల తండ్రి కన్నుమూత

14 Sep, 2019 02:24 IST|Sakshi

పీవీ హయాంలో పీఎంవోలో ప్రత్యేక కార్యదర్శిగా సేవలు

రూ. 2కే కిలో బియ్యం పథకాన్ని తీర్చిదిద్దడంలో కీలకపాత్ర

సాక్షి, హైదరాబాద్‌ : మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీఎన్‌ యుగంధర్‌ (82) శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు. తండ్రి మరణవార్తను సత్య నాదెళ్లకు కుటుంబ సభ్యులు తెలియచేశారు. ఆయన హైదరాబాద్‌ చేరుకున్నాక అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని, యుగంధర్‌ సమీప బంధువు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కేఆర్‌ వేణుగోపాల్‌ చెప్పారు. 1962 సివిల్‌ సర్వీస్‌ బ్యాచ్‌కు చెందిన యుగంధర్‌... 1983–85 మధ్య అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వద్ద పనిచేశారు. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు.

అలాగే ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యుడిగా, లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ డైరెక్టర్‌గా సేవలందించారు. అనంతపురం జిల్లా బుక్కాపురంలో జన్మించిన యుగంధర్‌ తన పేరులో బుక్కాపురం నాదెళ్ల యుగంధర్‌గా రాసుకున్నారు. ఆయన భార్య గతంలోనే కన్నుమూశారు. వారి ఏకైక సంతానం సత్య నాదెళ్ల. కాగా, బీఎన్‌ యుగంధర్‌ మరణంపట్ల తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌.జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. యుగంధర్‌ కుటుంబానికి, ఆయన కుమారుడు సత్య నాదెళ్లకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి కేటీఆర్, తెలంగాణ ఐఏఎస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు బీపీ ఆచార్య, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్య, యుగంధర్‌ మరణంపట్ల సంతాపం తెలియజేశారు.  

సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం
సాక్షి, అమరావతి: మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి, మాజీ ఐఏఎస్‌ అధికారి బీఎన్‌ యుగంధర్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  

మరిన్ని వార్తలు