ఎమ్మెల్సీగా సత్యవతి రాథోడ్‌

13 Mar, 2019 14:45 IST|Sakshi
సంబురాలు చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు

ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో సంబురాలు

మానుకోటకు వరించనున్న మంత్రి పదవి..!

సాక్షి, మహబూబాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సత్యవతి రాథోడ్‌ విజయం సాధించారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. దీంతో మలివిడత మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉండనున్నాయని టీఆర్‌ఎస్‌ శ్రేణులు అశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు డోర్నకల్‌ ఎమ్మెల్యేగా రెడ్యానాయక్‌కు అవకాశం ఇచ్చారు.

అలాగే భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో సత్యవతి రాథోడ్‌కు  ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఆమెకు అవకాశం కల్పించగా, తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగగా, సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్‌ పూర్తి చేసి అభ్యర్థుల ఫలితాలను అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ప్రకటించారు.

ఏకపక్షమే..

- సత్యవతి రాథోడ్‌ 

ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంఐఎంతో కలిసి మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్, ఎగ్గే మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డి, మీర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌ ఎఫండీలను బరిలో నిలిపింది. అలాగే కాంగ్రెస్‌ పార్టీ తనకు ఉన్న 19 మంది ఎమ్మెల్యేలతోపాటు, టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 21 మంది ఎమ్మెల్యేల బలంతో కాంగ్రెస్‌ పార్టీ తరుఫున అభ్యర్థిని ప్రకటించింది.

తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు, అసిఫాబాద్‌ ఎమ్మెల్యే అత్రం సక్కు , ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తమ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నందుకు నిరసనగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.

పార్టీ ఎమ్మెల్యేలెవరూ పోలింగ్‌లో పాల్గొనవద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విప్‌ జారీ చేశారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పోలింగ్‌కు దూరంగా ఉండటంతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల విజయం ఏకపక్షం అయ్యింది.

మలి విడతలోనైనా మంత్రి పదవి వరించేనా...!

తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రివర్గంలో మహిళలకు అవకాశం దక్కలేదు. తరువాత జరిగిన బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పిస్తానన్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిథ్యం లేకపోవటంతో సత్యవతికి అవకాశం కల్పించేందుకే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంచాన వేస్తున్నారు.

అలాగే ఇద్దరు మహిళలలో ఎమ్మెల్యేల నుంచి ఒక్కరిని, ఎమ్మెల్సీల నుంచి మరోక్కరిని మంత్రిగా అవకాశం కల్పించే అవకాశం ఉందని సమాచారం. దీంతో మలివిడుత మంత్రివర్గ విస్తరణలో జిల్లానుంచి సత్యవతి రాథోడ్‌కు మంత్రిపదవి వరించనున్నదని ఆమె అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు