‘సఖి’ ఇక కలెక్టరేట్లో!

12 Jan, 2020 02:19 IST|Sakshi

అన్ని జిల్లా కలెక్టర్లకు లేఖ రాయాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: మహిళలకు ఆపద సమయంలో సత్వర సేవలను ఒకే గొడుగు కింద అందించే సఖి (వన్‌ స్టాప్‌) సెంటర్లను ప్రభుత్వ భవనాల్లో నిర్వహించే అంశాన్ని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లా కేంద్రాల్లో సఖి కేంద్రాలున్నాయి. వీటిలో దాదాపు అన్ని కేంద్రాలు ప్రైవేటు భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భద్రత ప్రమాణాల దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలున్న చోట వీటిని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ శాఖ ఈ మేరకు యోచిస్తోంది.

ప్రస్తుతం అన్ని కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లను నిర్మిస్తుండగా.. ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే కలెక్టరేట్‌ భవనం విశాలమైన ప్రాంతంలో ఉంది. ఈ క్రమంలో కలెక్టరేట్‌ క్యాంపస్‌లోనే సఖి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ విస్తృత ప్రచారంతో పాటు సేవల కల్పన సులభతరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

పాత పది జిల్లాల్లో...
రాష్ట్రంలో 33 జిల్లాలుండగా.. 26 జిల్లాల్లో మాత్రమే సఖి కేంద్రాలున్నాయి. ఇందులో పాత పది జిల్లాల్లో సఖి కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు రెండేళ్లవుతోంది. కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటైతే అందులో 16 జిల్లాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సఖి కేంద్రాలను మంజూరు చేసింది. మిగతా జిల్లాల్లో ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అవి పెండింగ్‌లో ఉన్నాయి. పండుగ తర్వాత ఈ అంశంపై మంత్రి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు