బాలలను కాపాడుకుందాం

22 Sep, 2017 01:41 IST|Sakshi
బాలలను కాపాడుకుందాం

‘భారత్‌ యాత్ర’లో నోబెల్‌ గ్రహీత సత్యార్థి
సురక్షిత తెలంగాణను నిర్మిద్దామంటూ పిలుపు


సాక్షి, హైదరాబాద్‌: ‘‘పేద పిల్లల శ్రమను దోచుకునే, బాలలను పని వస్తువులుగా చూసే ధోరణులు అత్యంత హేయం. వీటివల్లే సమాజంలో బాలలపై లైంగిక దాడులు, వెట్టి చాకిరి, బానిసత్వం, అక్రమ రవాణా, వ్యభిచారం వంటివి ఇంకా కొనసాగుతున్నాయి’’ అని నోబెల్‌ శాంతి పురస్కార గ్రహిత కైలాశ్‌ సత్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జాఢ్యాలపై అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఇందుకోసమే ఈ నెల 11న కన్యాకుమారి నుంచి తాను భారత్‌ యాత్రను చేపట్టానన్నారు. యాత్ర హైదరాబాద్‌ చేరిన సందర్భంగా గురువారం పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమై మాట్లాడారు. ‘‘చదువుకున్న, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు తమ కుటుంబీకుల చేతిలోనే లైంగిక వేధింపులకు గురవుతున్నారు. పిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో 70 శాతం నిందితులు మేనమామ, చిన్నాన్న, పెదనాన్న వంటి సమీప బంధువులే.

మధ్యతరగతి తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే సమయం లేక వారికి రక్షణ కరువైంది. వీటిపై పిల్లలను చైతన్యపరిచేందుకు తల్లిదండ్రులకు సిగ్గు, బిడియం వంటివి అడ్డొస్తున్నాయి. గత నెలలో ముంబైలో ఓ ఐఏఎస్‌ దంపతుల 13 ఏళ్ల బాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని నలుగురు వ్యక్తులు లైంగికంగా వేధించారని తర్వాత తెలిసింది. ఇటీవల గుర్గావ్‌లో ఓ పాఠశాలలో 11 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి, హత్యకు గురయ్యాడు. మన దేశంలో 53 శాతం బాలలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని పదేళ్ల కిందే కేంద్రం ఓ నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఓవైపు 22 కోట్ల మంది పెద్దలు నిరుద్యోగులున్నారు. మరోవైపు ఏకంగా 15 కోట్ల మంది బాల కార్మికులున్నారు’’అని ఆవేదన వెలిబుచ్చారు. బాలలపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన వ్యవస్థ, నాయకత్వం, సహకారం అవసర మన్నారు. బాలలపై ఎలాంటి అఘాయిత్యాలూ జరగనివ్వబోమంటూ కోటి మంది భారతీయులతో ప్రతిజ్ఞ చేయించడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఈ పశువులకు దేశంలో చోటు లేదు
హైదరాబాద్‌ పాతబస్తీలోని పేద ముస్లిం బాలికలను పెళ్లి పేరిట వంచిస్తున్న అరబ్‌ షేక్‌ల ముఠాను అరెస్టు చేసిన నగర పోలీసులను సత్యార్థి అభినం దించారు. సురక్షిత తెలంగాణను నిర్మిద్దామంటూ పిలుపునిచ్చారు. ‘‘ఈ బాలికలు దేశ మాత పుత్రికలు. వారిపై లైంగిక హింసను వ్యతిరేకించాలి. దీనిపై పాతబస్తీవాసుల్లో చైతన్యం కల్పించాలి. అరబ్‌ షేక్‌లు దశాబ్దాలుగా ఇక్కడికొచ్చి మన పుత్రికలను సంతలో పశువుల మాదిరిగా కొంటున్నారు. ఇలాంటి పశువులకు దేశంలో చోటు లేదు’’అన్నారు.

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో భారీ సభ
భారత్‌ యాత్ర హైదరాబాద్‌ చేరిన సందర్భంగా గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. బుద్ధుడు, గాంధీజీ పుట్టిన దేశంలో చిన్నారుల అక్రమ రవాణాపై యుద్ధం ప్రకటిద్దామని సత్యార్థి పిలుపునిచ్చారు.  ఈ దిశగా తెలంగాణ కృషి చేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఎంపీలు కె.కేశవరావు, వినోద్‌కుమార్, విశ్వేశ్వర్‌రెడ్డి, జాతీయ బాలల హక్కుల కమిషన్‌ మాజీ సభ్యురాలు శాంతా సిన్హా, ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

కైలాశ్‌ సత్యార్థికి అసెంబ్లీలో ఘనస్వాగతం
కైలాశ్‌ సత్యార్థికి ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. గురువారం అసెంబ్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన కైలాస్‌ సత్యార్థికి పలువురు మంత్రులు స్వాగతం పలికారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు కైలాశ్‌ నివాళులు అర్పించారు. సత్యార్థి గౌరవార్థం అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి విందు ఏర్పాటు చేశారు. అనంతరం స్పీకర్‌ చాంబర్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిషన్‌ కాకతీయపై డాక్యుమెంటరీని కైలాశ్‌ తిలకించారు. బాలల హక్కుల కోసం తాను నిర్వహిస్తున్న యాత్రకు తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం, ఎన్జీవోల నుంచి మద్దతు లభించిందన్నారు.  

మిషన్‌ కాకతీయకు కితాబు
మిషన్‌ కాకతీయ పథకాన్ని కైలాశ్‌ సత్యార్థి ప్రశంసించారు. ఇలాంటి తరహాæపథకాలు దేశమంతటా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం స్పీకర్‌ మధుసుదనాచారితో పాటు పలువురు నేతలు కైలాశ్‌ సత్యార్థిని శాలువ, మెమోంటోలతో సత్కరించారు.

మరిన్ని వార్తలు