నీటి బొట్టు.. ఒడిసి పట్టు 

22 Mar, 2019 14:56 IST|Sakshi

 నీటిని వృథా చేయొద్దు.. 

భవిష్యత్‌ తరాలకు అందించాలంటున్న పర్యావరణ నిపుణులు 

 నేడు ప్రపంచ జల దినోత్సవం

సాక్షి, మహబూబాబాద్‌ :: జీవరాశి మనగడకు జలమే ఆధారం.. నీరే ప్రాణధారం.. అది అమృత తుల్యం. విలువైన నీటిని తెలిసే కొందరు. తెలియక మరికొందరు వృథా చేస్తుంటారు.. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో చెరువులు,కుంటల్లో నీరు ఇంకిపోతోంది. ప్రాజెక్టులు అడుగంటాయి. భూగర్భ జలాలు పాతాలానికి పడిపోతున్నాయి.అసలే వేసవి కావడంతో మండుతున్న ఎండలతో బోరుబావులు, ఎండిపోతున్నాయి.

దీంతో తాగు నీటి సమస్య రోజురోజుకు ఉధృత రూపం దాలుస్తోంది. నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నపుడు దాని విలువను గుర్తించకుండా యథేచ్ఛగా వినియోగించిన వారు అదే నీరు దొరకని పరిస్థితుల్లో గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు.ఇప్పటికీ మేలుకోక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారే గాని, సమస్య పునరావృతం కాకుండా చూసుకోవడం లేదు. మానవాళికి మనుగడనిస్తున్న నీటి ప్రాముఖ్యతను గుర్తించిన ప్రపంచ దేశాలు. నీటి సంరక్షణ కోసం చేపటాల్సిన కార్యక్రమాన్ని వివరించేందుకు ఏటా మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.

వృథాగా పోతున్న నీళ్లు
ప్రతి గ్రామంలో మంచినీటి కులాయిలు, తాగునీటి నల్లాలు, పైపులైన్ల లీకేజీల వద్ద పెద్ద ఎత్తున నీరు వృథాగాపోతోంది. మనం భవిష్యత్‌ తరాలకు నీటిని అందించాలంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది.   ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, పర్యావరణం, ప్రగతి అనే అంశంపై 1992లో రియోడిజెనేరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి మహాసభ (యుఎన్‌సీఈడీ ) లో రూపుదిద్దుకున్నది.

ఇందులో భాగంగా  2010 సంవత్సరాన్ని ఆరోగ్యవంతమైన ప్రపంచంకోసం  పరిశుభ్రమైన నీరు అనే  నిర్దిష్ట భావనతో నీటి పొదుపుకు సంబంధించిన సూత్రాలను పాటించాలని సూచిస్తోంది.  ప్రతిరోజూ , మనకు కనీసం 30–50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. ఇప్పటికీ  88.4 కోట్ల మంది( 884 మిలియన్ల మంది) ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదంటే అతిశయోక్తి లేదు. చాలామందికి స్వచ్ఛమైన నీరు దొరకక వ్యర్థమైన నీటినే వినియోగించి పలు రోగాల పాలవుతున్నారు. 

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న దిశా సంస్థ.. 
మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన దిశ సేవా సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, చేపడుతోంది. ప్రతీ వేసవి కాలం నీటి ఎద్దడి, వాడుకునే విధానం, మంచినీటి అవసరాలపై మానుకోట జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ సంస్థ నిర్వాహకులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాగునీటిని వృథా చేయొద్దు.. ముందు తరాలకు అందిద్దామని సూచనలు చేస్తున్నారు.  పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక ప్రగతి , కొత్తరకాల కాలుష్యానికి మూలమవుతున్న తీరును ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతీ రంగంలో నీరు ప్రధానమైనది. వ్యవసాయం, పరిశ్రమల్లో నీటిని పొదుపుగా వాడుకుంటేనే శ్రేయస్కరమని, భవిష్యత్‌ తరాలకు అందేలా కృషి చేయాలని  పర్యావరణ నిపుణులు తెలుపుతున్నారు. 
   
మొక్కలు నాటాలి 
ఖాళీ స్థలంలో విడివిడిగా మొక్కలు నాటాలి. ఉన్న చెట్లను పరిరక్షించాలి. ఈ చర్యల ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గిం చవచ్చు. దీంతో సకా లంలో వర్షాలు కురిసి చెరువులు, కుంటల నిండా నీళ్లు ఉంటాయి. తద్వారా నీరు ఇంకిపోకుండా వేసవి కాలంలో ఉపయోగపడుతాయి.
– దైద వెంకన్న, వన ప్రేమికుడు, మానుకోట  

మరిన్ని వార్తలు