కాస్టింగ్‌ కౌచ్‌పై బహిరంగ విచారణ జరపాలి

27 Apr, 2019 02:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ, టీవీ రంగాన్ని కుదిపేసిన కాస్టింగ్‌ కౌచ్, నటీమణుల వేధింపులకు సంబంధించి బాధితుల సమస్యలను తెలుసుకునేందుకు బహిరంగ విచారణ జరపాలని, ఇందుకు సంబంధించి సమయం, తేదీ, ప్రత్యేక ఎజెండాను రూపొందించాలని ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ సభ్యులు నిర్ణయించారు. శుక్రవారం హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ భవనంలో సంస్థ చైర్మన్‌ రామ్మోహన్‌రావు అధ్యక్షతన కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీవీ, సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు, న్యాయ విభాగాల ఉన్నతాధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

సినీ, టీవీ రంగంలో మహిళల సంఖ్య గణనీయంగా పెంచేందుకు, వారిని ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జూనియర్‌ ఆర్టిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై నిపుణుల అభిప్రాయాలను సేకరించారు. ఆయా సమస్యలపై బాధిత మహిళల అభిప్రాయాలను సేకరించి వీటి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందజేయాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. మరో రెండు వారాల్లో సినీ, టీవీ రంగాల్లోని అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి.. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు మరోసారి సమావేశం అవుతామని ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. కాగా, ఈ కమిటీలో సభ్యత్వం లేని సినీనటి జీవిత ఈ సమావేశానికి హాజరుకావడం పట్ల పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు.  

మరిన్ని వార్తలు