రూ.3 లక్షల కోట్లు!

7 Jul, 2018 02:08 IST|Sakshi

దేశవ్యాప్తంగా రైతు పెట్టుబడికి అయ్యే ఖర్చు ఇదీ

ఎస్‌బీఐ పరిశోధన సమగ్ర నివేదిక వెల్లడి

కష్టాల్లోని రైతులకు ‘రైతుబంధు’తో ఊరట

కౌలు రైతులకు సాయం చేయకపోవడమే పథకం ప్రధాన లోపం 

రైతు సమస్యలకు ‘రైతుబంధు’ తుది పరిష్కారం కాదని ఉద్ఘాటన

సాక్షి, హైదరాబాద్‌: ‘‘రైతులను ఆదుకోవడంలో మూడు తక్షణ పరిష్కారాలున్నాయి. ఒకటి రైతులు పండించిన పంటకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర కల్పించడం. రెండోది మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న భవంతర్‌ భుగ్తాన్‌ యోజన (బీబీవై) పథకం కింద మద్దతు ధరకు, మార్కెట్‌ ధరకు తేడాను ప్రభుత్వమే రైతులకు చెల్లించడం. మూడోది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం కింద రైతులకు నేరుగా డబ్బులు ఇవ్వడం.

ఇందులో రైతుబంధు పథకం అమలు చేయడంలో వ్యవస్థీకృతంగా ఎలాంటి లోపాలు తలెత్తవు. అక్రమాలు కూడా జరగవు. రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే రూ.3 లక్షల కోట్ల ఖర్చు అవుతుంది’అని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పేర్కొంది. ఈ మూడు పథకాలపై ఎస్‌బీఐ జాతీయ స్థాయిలో పరిశోధన పత్రం తయారు చేసింది. ఇటీవల విడుదల చేసిన ఆ పత్రంలోని వివరాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతోంది. ఆ వివరాలను ‘సాక్షి’సేకరించింది.  

దేశంలోనే తొలిసారి..
తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టిందని ఎస్‌బీఐ తన నివేదికలో తెలిపింది. తెలంగాణలో 58.33 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇస్తున్నట్లు తెలిపింది. ఖరీఫ్, రబీలకు కలిపి ఒక్కో ఎకరానికి రైతుకు రూ.8 వేలు ఇస్తున్నట్లు పేర్కొంది.

అందుకోసం 2018–19 బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపింది. ‘‘రైతులకే నేరుగా డబ్బులు ఇవ్వడం దేశంలో మొదటిసారి. ఒకటిన్నర రెట్లు మద్దతు ధర కల్పించడం, బీబీఐ పథకం అమలు చేయడం కంటే రైతుబంధు పథకానికే అధికంగా ఖర్చవుతుంది’’అని ఎస్‌బీఐ విశ్లేషించింది. ఈ పథకంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారని అధికారులు పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా అమలుచేస్తే..
తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న రైతుబంధును దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే రూ.3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ఎస్‌బీఐ విశ్లేషించింది. నికర వ్యవసాయ సాగు భూమిని లెక్కలోకి తీసుకుం టే ఆ స్థాయిలో ఖర్చు అవుతుందని తేల్చి చెప్పింది. రైతుబంధును దేశవ్యాప్తంగా అమలు చేయడమంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహారమని పేర్కొంది.

రైతుబంధులో ప్రధాన లోపం కౌలు రైతులకు పెట్టుబడి సాయం కల్పించకపోవడమని స్పష్టంచేసింది. భూమిపై యాజమాన్య హక్కులున్న వారికే పెట్టుబడి సాయం చేస్తున్నారని చెప్పింది. రైతుబంధు పథకంతో సాగు భూమి, సాగుకాని భూమి విలువ మరింత పెరుగుతుందని వెల్లడించింది.  

దీర్ఘకాలిక పరిష్కారాలు చూపవు..
ఒకటిన్నర రెట్లు మద్దతు ధర కల్పించడం, బీబీఐ పథకం, రైతుబంధు పథకం.. ఈ మూడు రైతు సమస్యలకు తక్షణ పరిష్కారమే చూపుతాయని ఎస్‌బీఐ పేర్కొంది.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపించడం, వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తుల నిల్వ, రవాణాకు అత్యాధునిక సదుపాయాలు కల్పించడం, అత్యధిక కనీస మద్దతు ధర కల్పిస్తే దీర్ఘకాలిక పరిష్కారాలు చూపవచ్చని స్పష్టంచేసింది. అయితే కష్టాల్లో ఉన్న రైతులకు ఇతరత్రా పథకాలతోపాటు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం కల్పించడం ఉపయోగపడుతుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు