2,073 ఎకరాలు.. ‘పంపిణీ’కి సిద్ధం!

8 Dec, 2017 00:57 IST|Sakshi

రూ.96.74 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఎస్సీ కార్పొరేషన్‌

కొనుగోలు చేసిన భూమిని పొజిషన్‌లోకి తీసుకున్న యంత్రాంగం

లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు

త్వరలోనే పంపిణీ చేసేలా ప్రణాళిక

మార్చి నాటికి మరో 3 వేల ఎకరాల పంపిణీకి చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: దళితుల భూ పంపిణీపై ఎస్సీ కార్పొరేషన్‌ వడివడిగా కదులుతోంది. ఇప్పటివరకు భూముల కొనుగోలుపై దృష్టి సారించిన అధికారులు.. తాజాగా వాటిని పంపిణీ చేసే పనిలోపడ్డారు. 2017–18 వార్షిక సంవత్సరంలో 10,254 ఎకరాలు పంపిణీ చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఎస్సీ కార్పొరేషన్‌.. ఇప్పటివరకు 2,073 ఎకరాలకు సంబంధించి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది. ఇందుకు రూ.96.74 కోట్లు ఖర్చు చేసింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియతోపాటు రికార్డుల్లో మార్పులు పూర్తి చేసి.. సదరు భూమిని పొజిషన్‌లోకి తీసుకుంది. దీంతో ఈ భూమిని పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు.

మరో 3 వేల ఎకరాలు
ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్‌ వద్ద మరో 3 వేల ఎకరాలకు సంబంధించి ప్రతిపాదనలున్నాయి. ఈ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేస్తున్నారు. భూముల తీరును పూర్తిగా పరిశీలించిన తర్వాతే వాటిని కొనుగోలు చేయనున్నారు. మరోవైపు లక్ష్యానికి తగ్గట్టుగా పలు జిల్లాల్లో భూ లభ్యత ఆశాజనకంగా లేదు.

అనువైన భూములు ఉంటే ధరలు ఎక్కువగా ఉండటం.. తక్కువ ధరలుంటే సారం లేకపోవడంతో అధికారులు ఆయా భూముల జోలికి వెళ్లడం లేదు. దీంతో ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యంలో 50 శాతం మాత్రమే సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇక అందుబాటులో ఉన్న భూములను పూర్తి స్థాయి సౌకర్యాలతో పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ఈ నెలాఖరులోగా అందుబాటులో ఉన్న 2,073 ఎకరాలు పంపిణీ చేసి.. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 3 వేల ఎకరాలను పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించుకున్నారు.


11 జిల్లాల్లో నిల్‌!
భూ పంపిణీ పథకానికి సంబంధించి మూడు జిల్లాలకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించలేదు. హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో కొనుగోలుకు అనువైన భూములు లేవు. హైదరాబాద్‌ జిల్లాలో సాగు భూములు లేకపోగా.. మేడ్చల్‌ జిల్లాలో ఎకరా ధర కోట్లల్లో ఉండటంతో ఆ జిల్లాల్లో ఈ పథకం సాధ్యం కాదని అధికారులు అంచనాకు వచ్చారు. భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలోనూ ఈసారి లక్ష్యాన్ని నిర్దేశించలేదు.

ఇవికాక మరో ఎనిమిది జిల్లాల్లోనూ భూముల లభ్యత ఆశాజనకంగా లేదు. జగిత్యాల, జనగామ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్‌ (అర్బన్‌) జిల్లాల్లో భూ పంపిణీ పథకం నిబంధనల ప్రకారం సాగు భూములు లభించడం లేదు. దీంతో అధికారులు ఆయా జిల్లాల్లో భూములు కొనుగోలు చేయకపోవడంతో అక్కడ పంపిణీ ప్రక్రియకు బ్రేక్‌ వేశారు. దీంతో ఈ ఏడాది 20 జిల్లాల్లో మాత్రమే భూ పంపిణీ జరిగే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు