బడికి రావాలి గురు!

8 Jul, 2020 05:43 IST|Sakshi

8 నుంచి బడికి రావాలని టీచర్లకు ఎస్సీ గురుకుల సొసైటీ ఆదేశం

నైపుణ్యాభివృద్ధిలో భాగంగా వీడియో పాఠాలు, కంప్యూటర్‌ కోర్సుల్లో శిక్షణ

సాక్షి, హైదరాబాద్‌: గురుకులాల టీచర్లు ఇక బడిబాట పట్టనున్నారు.  అయితే, వారు వెళ్లేది పాఠం చెప్పేందుకు కాదు, సరికొత్త పాఠాలు నేర్చుకోవడానికి సుమీ! కరోనా కారణంగా మార్చి 16 నుంచి మూతబడిన గురుకుల పాఠశాలలు నేడు(బుధవారం) తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రబలుతుండడంతో పాఠశాలల పునఃప్రారంభాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరికొంతకాలం వాయిదా వేసిన విషయం తెలిసిందే.  టీచర్లు నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిమిత్తం గురుకులాలకు హాజరు కావాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) స్పష్టం చేసింది. ఈ మేరకు బోధన, బోధనేతర సిబ్బందికి ఆదేశాలు జారీచేసింది. అయితే, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌(గిరిజన), ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌(వెనుకబడిన తరగతులు), టీఎంఆర్‌ఈఐఎస్‌(మైనార్టీ) టీచర్లకు మాత్రం ఎలాంటి సమాచారం అందలేదు.

ఆన్‌లైన్‌ బోధనకు సిద్ధంగా..
ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది. మరోవైపు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ దిశగా యోచిస్తోంది. నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిమిత్తం గురుకులాలకు హాజరయ్యే టీచర్లు తమ సబ్జెక్టులపై మూడు నిమిషాల నిడివి గల వీడియోలను రూపొందించాలి. ఈ వీడియోలో గ్రాఫిక్స్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ జోడించేలా ప్రయత్నించాలి. ప్రతి గురుకులంలో ఉన్న కంప్యూటర్‌ ల్యాబ్‌ ఉపయోగించుకొని అవసరమైన ప్రాజెక్టులను రూపొందించాలని సొసైటీ ఆదేశాలు జారీ చేసింది. దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలున్నవారు, కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలోనివారికి విధుల నుంచి మినహాయింపు ఇచ్చింది.  కోవిడ్‌–19 వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో విధులకు హాజరుకావాలనడం పట్ల గురుకుల టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు