నేడు టీ-ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం!

30 May, 2014 03:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోసం 1994లో స్థాపితమైన ఎమ్మార్పీఎస్ తెలంగాణ ఎమ్మార్పీఎస్ పేరుతో చీలనుంది. మాదిగ విద్యార్థి ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) రాష్ట్ర కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర స్థాయి నేత మేడి పాపయ్య బహిష్కరణ అనంతరం ఎమ్మార్పీస్‌లో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎలాంటి నోటీసులు లేకుండా ముఖ్యనేతలను బహిష్కరించడాన్ని వ్యతిరేకిస్తూ  రాష్ట్ర, జిల్లా స్థాయి ఎమ్మార్పీఎస్ ప్రధాన నాయకులు సుమారు 200 మంది మంద కృష్ణమాదిగతో విభేదించి బయటికి వచ్చారు.
 
 ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి దండు సురేందర్‌మాదిగ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జీవమాదిగ, కార్యదర్శులు జన్ను కనకరాజుమాదిగ, చిలక ప్రభాకర్ మాదిగ తదితరులు బహిష్కరణకు గురైన వంగపల్లి శ్రీనివాస్, మేడిపాపయ్యమాదిగలకు అండగా ఉండి అసలైన ఎమ్మార్పీఎస్ తమదేనని ప్రకటించారు. తాజాగా మరో ముఖ్యనేత యాతాకుల భాస్కర్‌మాదిగ సైతం తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. బయటకు వచ్చిన వారంతా మంద కృష్ణమాదిగ ఏకపక్ష పోకడలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ పేరుతో శుక్రవారం కొత్త సంస్థను స్థాపించనున్నారు. ఇందుకు ఓయూ ఫ్యాకల్టీ క్లబ్ వేదిక కానుంది.

మరిన్ని వార్తలు