కులాంతర వివాహం చేసుకుంటే చంపేస్తారా!

29 Sep, 2018 04:20 IST|Sakshi
అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష జరుపుతున్న పార్లమెంటరీ కమిటీ సభ్యులు

     ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ కమిటీ విస్మయం

     ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి సూచన

     కులాంతర వివాహాల ప్రోత్సాహకం పెంచకపోవడంపై అభ్యంతరం

     రూ. 2.5 లక్షల ఆర్థికసాయం ఇవ్వాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: కులాంతర వివాహాలు చేసుకున్నవారిపై జరుగుతున్న దాడులపట్ల ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాంకేతికయుగంలోనూ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొంది. మిర్యాలగూడ, అమీర్‌పేట్‌లో చోటు చేసుకున్న వరుస ఘటనలపై ఆరా తీసిన సభ్యులు పైవిధంగా స్పందించారు. వీటిని అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహాలు చేసుకుంటే ఇచ్చే ఆర్థికసాయాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షలకు పెంచిందని, కానీ రాష్ట్రంలో కేవలం రూ.50 వేలు మాత్రమే ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం నిర్దేశించిన మొత్తాన్ని అర్హులకు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, ఆ వర్గాల ఆర్థిక, సామాజికాభివృద్ధిని అధ్యయనం చేసేందుకు తొమ్మిది మంది ఎంపీలతో కూడిన పార్లమెంటరీ కమిటీ గురువారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం రామోజీఫిల్మ్‌ సిటీలోని ఓ హోటల్‌లో పార్లమెంటరీ కమిటీ ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ సీతారాం నాయక్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కే జోషితోపాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమ పథకాల పురోగతిని అడిగి తెలుసుకుంటూనే వివిధ అంశాలపై ఉన్న సందేహాలను యంత్రాగంపై సంధించారు. వీటిలో కొన్నింటికి అధికారులు సమాధానాలు చెప్పినప్పటికీ... మెజారిటీ అంశాలపై స్పష్టత ఇవ్వలేకపోయారు. వివరణలను పక్షం రోజుల్లోగా పార్లమెంట్‌ కమిటీకి నివేదించాలని సభ్యులు స్పష్టం చేశారు.

తప్పుడు సమాచారమిస్తే చర్యలే...
ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని కచ్చితత్వంతో ఇవ్వాలని పార్లమెంటు కమిటీ అధికారులకు సూచించింది. తమ వద్ద సమాచారం ఉందని, వాటితో పొంతన లేకుండా గణాంకాలు పెంచి చూపొద్దని, తప్పుగా తేలితే తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొంది. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. గురుకులాలతో డ్రాపౌట్లు, కల్యాణలక్ష్మి పథకంలో బాల్యవివాహాలు తగ్గాయని వెల్లడించారు. రాష్ట్రంలో అట్రాసిటీ కేసులు పెరిగాయని పార్లమెంటు కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

కుల వివక్షతో జరిగిన మరణాల గురించి ప్రశ్నించగా, అలాంటి హత్యలు జరగలేదని అధికారులు అన్నారు. సింగరేణి మైనింగ్‌ విస్తరణలో భూములు కోల్పోయినవారి కోసం తీసుకున్న చర్యల గురించి కమిటీ సభ్యులు ప్రశ్నించగా అధికారులు తడబడ్డారు. ఇన్నోవేషన్‌ కార్యక్రమాలపైనా సభ్యులు ఆరా తీశారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు తెలపగా, ఎస్టీల గురించి ఆరా తీశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూపంపిణీ సాధ్యం కాదని తెలిపారు. అధ్యయనం తాలూకు నివేదికను వచ్చే పార్లమెంటు సమావేశాల నాటికి సమర్పించనున్నట్లు పార్లమెంటరీ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు