ఐదంచెల పర్యవేక్షణలో ‘ఎస్‌డీఎఫ్‌’

15 Sep, 2017 02:11 IST|Sakshi
ఐదంచెల పర్యవేక్షణలో ‘ఎస్‌డీఎఫ్‌’

ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు ఎస్టీ, ఎస్టీ అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌ల) మార్గదర్శకాలు విడుదల య్యాయి. దాదాపు ఆర్నెళ్ల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కంటే కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... పక్కా పర్యవేక్షణకు మార్గదర్శకాలిచ్చింది. ప్రత్యేక అభివృద్ధి నిధి కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కొత్తగా ఐదంచెల విధానాన్ని తీసుకొచ్చింది.

నిధుల వినియోగంలో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయికి చేరే క్రమంలో పర్యవేక్షణ, నిర్వహణ, నిఘాకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసింది. ఎస్సీ/ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ల అమలులో ప్రధానంగా రాష్ట్ర కౌన్సిల్‌ కీలకపాత్ర పోషించనుంది. దీనికి  ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరి స్తారు. ఇందులో కేబినెట్‌ మంత్రులు, ఎంపిక చేసిన ఎస్సీ/ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్లు, నామినేటెడ్‌ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి ఎస్సీ అభివృద్ధి/ గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మెంబర్‌ కన్వీనర్లుగా వ్యవహరిస్తారు.  

రాష్ట్ర స్థాయిలో నోడల్‌ ఏజెన్సీలు...: ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ల అమలులో రాష్ట్ర స్థాయిలో రెండు నోడల్‌ ఏజెన్సీలతో కమిటీలుంటాయి. ఆయా శాఖల మంత్రులు ఈ నోడల్‌ కమిటీలకు చైర్మన్లుగా.., మెంబర్‌ కన్వీనర్లుగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వ్యవహరిస్తారు. ఇందులో వివిధ శాఖలకు చెందిన 14 మంది ముఖ్య కార్యదర్శులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల కమిషనర్లు, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, సంబంధిత కార్యదర్శులు సభ్యులుగా, ఉంటారు. వీటితో పాటు రాష్ట్ర స్థాయి కమిటీలుంటాయి. వీటికి ప్రభుత్వం నియమించే ఎస్సీ/ఎస్టీ నామినేటెడ్‌ వ్యక్తులు చైర్మన్లుగా, ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మెంబర్‌ కన్వీనర్‌గా ఉంటారు. ఆర్థిక శాఖ కార్యదర్శి, మరో నామినేటెడ్‌ పర్సన్, సంబంధిత శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

జిల్లా స్థాయిలో...: ప్రత్యేక అభివృద్ధి నిధి పర్యవేక్షణ కమిటీలకు కలెక్టర్‌ చైర్మన్‌గా, ఎస్సీ,/ఎస్టీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఐటీడీఏ పరిధిలో ప్రాజెక్టు అధికారులు, నాన్‌ ఐటీడీఏ పరిధిలో జేసీ, డీటీడబ్ల్యూఓ, డీఎస్‌డీవోలు మెంబర్‌ కన్వీనర్లుగా, మరో 15శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో నిఘా కమిటీలకు ఎస్సీ/ఎస్టీ వ్యక్తులను చైర్మన్లుగా ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది. వీటికి జిల్లా కలెక్టర్‌ కన్వీనర్‌గా, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి, గిరిజన సంక్షేమాధికారి, సంబంధిత అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు ఏటా కనీసం రెండు సార్లు సమావేశమై పరిస్థితిని సమీక్షించాలి. ప్రత్యేక అభివృద్ధి నిధి ద్వారా చేపట్టే కార్యక్రమాలు, నిధుల వినియోగం, పనుల నాణ్యత తదితర అంశాలపై పరిశీలించాలి. కమిటీల నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేస్తుంది.

>
మరిన్ని వార్తలు