గిరి రాజులు 

20 Dec, 2018 10:50 IST|Sakshi

ఎస్టీల చేతుల్లోనే స్థానిక పాలన 

సాక్షి, కొత్తగూడెం: స్థానిక పాలనను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్విభజన చేసింది. దీంతో జిల్లాలో ఉన్న 205 గ్రామ పంచాయతీల సంఖ్య ఏకంగా 479కి పెరిగింది. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ ప్రకారం ఏజెన్సీ పరిధిలో ఉన్న భద్రాద్రి జిల్లాలో అత్యధిక ప్రాంతం ఏజెన్సీ పరిధిలోకే వస్తుంది. నిబంధనల మేరకు ఈ ప్రాంతాల్లో ప్రతీ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానం గిరిజనులకే కేటాయించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం 479లో 454 గ్రామపంచాయతీలు ఎస్టీలకు కేటాయించారు. అశ్వాపురం, అశ్వారావుపేట, బూర్గంపాడు, దమ్మపేట, సుజాతనగర్‌ మండలాల్లోని 25 గ్రామపంచాయతీలు మాత్రం నాన్‌–ఏజెన్సీ పరిధిలోకి వస్తున్నాయి. గతంలో జిల్లాలో 205 పంచాయతీలు ఉండగా వాటిలో 190 ఏజెన్సీ,  15 నాన్‌ ఏజెన్సీ పంచాయతీలుగా ఉండేవి. పంచాయతీరాజ్‌ చట్ట సవరణ అనంతరం చేపట్టిన పునర్విభజన ప్రకారం గతంలో ఉన్న 205 పంచాయతీలు 479కి పెరిగాయి.

కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో 10 నాన్‌ షెడ్యూల్డ్‌ గా ఉన్నాయి. దీంతో గతంలో 15గా ఉన్న ఆ పంచాయతీల సంఖ్య ప్రస్తుతం 25కు చేరుకున్నాయి. అశ్వాపురం మండలంలోని రామచంద్రాపురం, నెల్లిపాక, ఆనందపురం, మల్లెలమడుగు, మొండికుంట, అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువు, అశ్వారావుపేట, కేసప్పగూడెం, పాతఅల్లిగూడెం, ఊట్లపల్లి, పేరాయిగూడెం, బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం, బూర్గంపాడు, టేకులచెరువు, దమ్మపేట మండలంలోని జమేదార్‌బంజర, దమ్మపేట, కొమ్ముగూడెం, లింగాలపల్లి, సుజాతనగర్‌ మండలంలోని నాయకులగూడెం, లక్ష్మీదేవిపల్లి, కోమట్లపల్లి, మంగపేట, నిమ్మలగూడెం, సుజాతనగర్, నర్సింహసాగర్‌ పంచాయతీలు నాన్‌ షెడ్యూల్డ్‌ పరిధిలోకి వస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక గిరిజన పంచాయతీలు భద్రాద్రి జిల్లాలోనే ఉండడంతో ఇక్కడ స్థానిక పాలన ఎస్టీల చేతుల్లో ఉండనుంది. 

జిల్లాలో 4,232 వార్డులు... 
పునర్విభజన తర్వాత జిల్లాలోని ఆళ్లపల్లి మండలంలో 12 పంచాయతీలు ఉన్నాయి. అన్నపురెడ్డిపల్లి మండలంలో 10, అశ్వాపురంలో 24, అశ్వారావుపేటలో 30, బూర్గంపాడులో 17, చంద్రుగొండలో 14, చర్ల మండలంలో 26, చుంచుపల్లి మండలంలో 18, దమ్మపేటలో 31, దుమ్ముగూడెంలో 37, గుండాల మండలంలో 11, జూలూరుపాడులో 24, కరకగూడెం మండలంలో 16, లక్ష్మీదేవిపల్లిలో 31, మణుగూరులో 14, ములకలపల్లిలో 20, పాల్వంచలో 36, పినపాకలో 23, సుజాతనగర్‌ మండలంలో 20, టేకులపల్లిలో 36, ఇల్లెందు మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 479 గ్రామ పంచాయతీల్లో కలిపి 4,232 వార్డులు ఉన్నాయి.  జిల్లాలో మొత్తం 23 మండలాలు ఉండగా, కొత్తగూడెం, భద్రాచలం మినహా మిగిలిన 21 మండలాల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ మండలాల్లోని 479 గ్రామ పంచాయతీల్లో కలిపి మొత్తం 7,68,805 మంది జనాభా ఉన్నారు. ఇందులో పురుషులు 3,83,693 మంది, మహిళలు 3,85,112 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీ జనాభా 3,57,207 కాగా ఇందులో పురుషులు 1,77,501, మహిళలు 1,79,706 మంది ఉన్నారు.

ఎస్సీ జనాభా 92,551 కాగా ఇందులో పురుషులు 46,424 మంది, మహిళలు 46,127 మంది ఉన్నారు. ఎస్టీ, ఎస్సీ యేతరులు 3,19,047 ఉండగా ఇందులో పురుషులు 1,59,768 మంది, మహిళలు 1,59,279 మంది ఉన్నారు. ఇక ఈ 479 పంచాయతీల్లో 25 పంచాయతీలు నాన్‌–షెడ్యూల్డ్‌ పరిధిలో ఉన్నాయి. వీటిలో మొత్తం 67,014 మంది  ఉండగా,  పురుషులు 33,298 మంది, మహిళలు 33,716 మంది ఉన్నారు. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం పంచాయతీల పరిధిలో మొత్తం 8,42,096 మంది జనాభా ఉండగా ఇందులో బూర్గంపాడు మండ లంలోని సారపాక, భద్రాచలంను గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఇల్లెందు మున్సిపాలిటీలో సత్యనారాయణపురం, 24 ఏరియాల(సింగరేణి కాలనీ)ను విలీనం చేశారు. దీంతో ఈ రెండు గ్రామాల్లోని 3,035 మంది జనాభా, మున్సిపాలిటీలుగా అప్‌ గ్రేడ్‌ అయిన భద్రాచలంలోని 50,087 మంది, సారపాకలోని 20,169 మంది జనాభాను మినహాయించారు. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీల పరిధిలో 7,68,805 మంది జనాభా ఉన్నట్లు తేల్చారు. 

మరిన్ని వార్తలు