గాలి నుంచి నీటిని తెచ్చారు..

23 Jun, 2018 03:47 IST|Sakshi
గాలి నుంచి నీటిని తయారు చేసే ‘మేఘ్‌దూత్‌’ యంత్రం​

గాలి నుంచి నీటిని తయారు చేసే ‘మేఘ్‌దూత్‌’ 

ఐఐసీటీ వినూత్న ఆవిష్కరణ 

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజలందరికీ స్వచ్ఛమైన, కాలుష్యరహిత తాగునీరు అందించేందుకు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. గాల్లోని తేమను నీటిగా ఒడిసిపట్టడంతో పాటు, నీటిలో లవణాలు చేర్చేందుకు ఓ యంత్రాన్ని తయారు చేశారు. ఇలాంటి యంత్రాలు విదేశాల్లో అందుబాటులో ఉన్నప్పటికీ తాము తయారు చేసిన మేఘ్‌దూత్‌ యంత్రం చౌక అని, సౌరశక్తితో పనిచేస్తుందని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఎస్‌.శ్రీధర్‌ తెలిపారు.

మైత్రీ ఆక్వాటెక్‌ అనే సంస్థతో తాము ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, ఈ యంత్రాలను ఈ ఆగస్ట్‌ నుంచి తయారు చేయనున్నట్లు చెప్పారు. దాదాపు 9 యూనిట్ల విద్యుత్‌ ద్వారా ఈ యంత్రం రోజులో వెయ్యి లీటర్ల తాగునీరు అందిస్తుందన్నారు. గాలిలోని 45 శాతం తేమ ఉన్నా సరే ఇది నీటిని ఒడిసిపడుతుందని, తేమశాతం ఎక్కువగా ఉండే సముద్ర తీర ప్రాంతాల్లో రోజుకు 1,400 లీటర్ల నీరు ఉత్పత్తి చేయొచ్చని చెప్పారు.

కలాం స్టెంట్‌ స్థాయి ఆవిష్కరణ ఇది
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంతో కలసి తాము అభివృద్ధి చేసిన చౌక స్టెంట్‌తో సరిపోలగల ఆవిష్కరణ మేఘ్‌దూత్‌ అని ఈ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించిన అరుణ్‌ తివారీ తెలిపారు. స్వచ్ఛమైన తాగునీరు అందరికీ అందుబాటులో ఉంటే, రోగాల భారం గణనీయంగా తగ్గుతుందని ఈ లక్ష్యంతోనే తాము మేఘ్‌దూత్‌ను అభివృద్ధి చేశామని ఐఐసీటీ డైరెక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు