మార్కెట్‌లోకి తేలికపాటి స్కూల్‌ బ్యాగులు

8 May, 2019 06:54 IST|Sakshi

మార్కెట్‌లోకి తేలికపాటి స్కూల్‌ బ్యాగులు

ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా తయారీ

నవ్యత.. నాణ్యతతో పాటు తక్కువ ధరల్లో..  

సాక్షి,సిటీబ్యూరో: పిల్లలకు ప్రస్తుతం పరీక్షలు అయిపోయి స్కూళ్లకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. మే నెల అంతా సెలవులే అయినా.. మళ్లీ స్కూళ్లు తెరిచేనాటికి వారికి పుస్తకాలు.. యూనిఫాంతో పాటు స్కూలు బ్యాగులు వంటివి సమకూర్చాలి. గతంలో బ్యాగ్‌ అంటే బియ్యం బస్తా అంత బరువుండేది. కానీ ప్రభుత్వం స్కూలు బ్యాగు విషయంలో కఠినమైన నిబంధనలు విధించడంతో ప్రస్తుతం మార్కెట్లో తేలికపాటి మెటీరియల్‌తో తయారు చేసిన బ్యాగులు అందుబాటులోకి వచ్చాయి. పిల్లల తరగతులకు అనుగుణంగా వీటిని రూపొందించారు. ప్రస్తుతం నగరంలో దేశీ బ్రాండ్లతో పాటు అంతర్జాతీయ బ్రాండెడ్‌ స్కూల్‌ బ్యాగ్‌లు అందుబాటులోకి వచ్చాయి. పిల్లల క్లాస్‌ స్థాయిని బట్టి వివిధ డిజైన్లతో పాటు తక్కువ బరువు గల స్కూల్‌ బ్యాగ్‌లను వివిధ కంపెనీల బ్యాగ్‌లు మార్కెట్‌లో ప్రవేశపెట్టాయి. ఇవి కేజీ స్థాయి నుంచి కాలేజీ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. అందుకు అనుగుణంగా నగరంలోని ప్రాచీనమైన బ్యాగ్‌ విక్రయ కేంద్రం మదీనా సర్కిల్, టోలిచౌకీ, మదీనా సర్కిల్‌లోని మహ్మద్‌ క్యాప్‌ మార్ట్‌లో అతి తక్కువ బరువులతో బ్రాండెడ్‌ స్కూల్‌ బ్యాగులను అందుబాటులో ఉంచారు. ఈ నెల రోజులూ ‘బ్యాగ్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌’ కూడా ఏర్పాటు చేశారు.

క్లాస్‌ ప్రకారం బ్యాగ్‌ బరువు
కిండర్‌గార్టన్‌ (కేజీ) పిల్లలకు 100 గ్రాముల నుంచి మొదలు బ్యాగు బరువు ప్రారంభమవుతుంది. మూడో తరగతి, ఐదో తరగగతి, 8వ తరగతి, 10వ తరగతి, కాలేజీ విద్యార్థులకు కూడా తక్కువ బరువు గల బ్రాండెడ్‌ కంపెనీల బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి 150 గ్రాములు మొదలు 500 గ్రాముల లోపే ఉండడం విశేషం. పైగా వీటిని అత్యంత నాణ్యమైన, వర్షంలో తడవని (వాటర్‌ రెసిస్టెంట్‌)  మెటీరియల్‌తో రూపొందించారు. అంతేకాదు.. ఎండను కూడా తట్టుకోవడం ఈ క్లాత్‌ ప్రత్యేకత.  

ఏడాది గ్యారంటీ..
గతంలో బరువుతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా బ్యాగులు చేశారు. గతేడాది ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా తక్కువ బరువుతో స్కూల్‌ బ్యాగ్‌లను విద్యార్థుల సౌకర్యార్థం తయారు చేయిస్తున్నాం. దీంతో పాటు విదేశీ బ్రాండ్‌ కంపెనీల బ్యాగ్‌లను కూడా దిగుమతి చేసుకున్నాం. ప్రస్తుతం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బ్రాండెడ్‌ కంపెనీల లైట్‌ వెయిట్‌ స్కూల్‌ బ్యాగ్‌లు కొనేందుకే ఆసక్తి చూపుతున్నారు. బ్రాండెడ్‌ స్కూల్‌ బ్యాగ్‌లు ధరలు కూడా రూ.250 నుంచి రూ.1000 వరకు ధరల్లో ఉన్నాయి. బ్యాగ్‌లకు ఏడాది పాటు గ్యారెంటీ కూడా ఇస్తున్నాం.– ఇల్యాస్‌ బుకారీ, మహ్మద్‌ క్యాప్‌ మార్ట్‌  

ఫారిన్‌ బ్యాగ్‌లపైనే క్రేజ్‌
విదేశాల్లో తయారయ్యే వివిధ రకాల స్కూల్‌ బ్యాగ్‌లు నగర మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.అమెరికన్‌ టూరిస్టర్, స్కైబ్యాగ్, ఎఫ్‌ గెయిర్, నైకీ, ప్యూమాతో పాటు స్వదేశీ కంపెనీలు కూడా లైట్‌ వెయిట్‌ బ్యాగ్‌లను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేశాయి. ఈ బ్యాగ్‌లు తక్కువ బరువుతో పాటు స్టయిల్‌గా, బుక్స్‌తో పాటు ఇతర వస్తువులు పెట్టుకోడానికి అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం పిల్లలు, కాలేజీ విద్యార్థులు ఇలాంటి బ్యాగ్‌లపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. 

మరిన్ని వార్తలు