సబ్బు బిళ్ల.. స్కూలు బల్ల.. కాదేదీ అవినీతికి అనర్హం!

3 Jan, 2018 04:04 IST|Sakshi

అధిక ధరలతో డ్యుయల్‌ డెస్క్‌ల కొనుగోళ్లు

లక్ష బల్లలకు ఆర్డర్‌ ఇచ్చిన విద్యాశాఖ

ఒక్కో డ్యుయల్‌ డెస్క్‌ ధర రూ.5,050

బయటి మార్కెట్, జెమ్‌ కంటే రూ.వెయ్యి అదనం

టెండర్లు లేవు.. నామినేషన్‌పైనే పనుల అప్పగింత

సెంట్రల్‌ జైలు నుంచి సరఫరా పేరిట

ఓ వ్యాపారికి ఆర్డర్‌ లక్ష డెస్కుల తయారీ

సామర్థ్యం లేకున్నా పనుల కేటాయింపు

విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన డ్యుయల్‌ డెస్క్‌ల కొనుగోలు వివాదాస్పదమవుతోంది. చర్లపల్లి సెంట్రల్‌ జైలు నుంచి డ్యుయల్‌ డెస్క్‌ల సరఫరా పేరిట ఓ మధ్య వ్యాపారి అధిక ధరలతో వంద.. వెయ్యి కాదు.. ఏకంగా లక్ష బల్లలను సరఫరా చేసేలా ఆర్డర్‌ సొంతం చేసుకున్నారు. విద్యాశాఖ టెండర్లు పిలిచి ఈ పనులు అప్పగించిందా? అంటే అదీ లేదు. జైళ్ల శాఖ పేరుతో నామినేషన్‌పై వీటి కొనుగోలుకు విద్యా శాఖ ఓకే చెప్పింది. సాధారణంగా రూ.10 లక్షల విలువైన పనులకూ ప్రభుత్వానికి ఫైలు పంపించే విద్యా శాఖ రూ.50 కోట్ల విలువైన ఈ పనులకు సొంతంగా ఆర్డర్‌ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. పైగా చర్లపల్లి సెంట్రల్‌ జైలులో ఏడాది పొడవునా పని చేసినా లక్ష బల్లల తయారీ సామర్థ్యం లేదని విద్యాశాఖ అధికారులే చెబుతున్నారు. అయినా జైలు పేరుతో బయటి వ్యక్తికి లక్ష బల్లల సరఫరా ఆర్డర్‌ అప్పగించారని, ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్ల దందా కొనసాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఓపెన్‌ మార్కెట్‌లో చూస్తే..
విద్యాశాఖ ఆర్డర్‌ ఇచ్చిన డ్యుయల్‌ డెస్క్‌లను పరిశీలిస్తే అంత ధర లేదని చిన్నతరహా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురు విద్యార్థులు కూర్చునేందుకు వీలున్న ఈ బల్లల తయారీకి రూ.2,800 వరకు ఖర్చవుతుందని, సరఫరా, లాభాల కింద రూ.1,200 కలిపినా రూ.4 వేలకు మించదని పేర్కొంటున్నాయి. కానీ ముగ్గురు విద్యార్థులు కూర్చునే బల్లలకు రూ.5,050 రేటుతో రూ.50 కోట్లకుపైగా విలువైన ఆర్డర్‌ను ఎలాంటి టెండర్లు లేకుండా ఇవ్వడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇవేకాదు పదో తరగతి పరీక్షల కోసం మరో 11 వేల వరకు డ్యుయల్‌ డెస్క్‌ల సరఫరాకూ ఆర్డర్‌ ఇచ్చింది. ఈ వ్యవహారంలో రూ.15 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖ మాత్రమే కాదు.. సోషల్‌ వెల్ఫేర్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ శాఖలు కూడా గురుకులాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జైల్లో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయాలి. సాధారణంగా జైలులో తయారు చేసే బల్లలపై పన్నులు ఉండవు. అలాంటప్పుడు మరింత రేటు తగ్గాల్సి ఉన్నా.. అధిక ధరలకు ఆర్డర్‌ ఇవ్వడం గమనార్హం.

జెమ్‌ ఏం చెబుతోందంటే..
గవర్నమెంట్‌ ఈ–మార్కెట్‌ప్లేస్‌(జెమ్‌).. ప్రధానమంత్రి నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ సూచనల మేరకు ఏర్పాటైన ఆన్‌లైన్‌ మార్కెట్‌ ఇదీ. ఇందులో వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు రిజిస్టర్‌ చేసుకోవాలి. ప్రభుత్వాలకు అవసరమైన పరికరాలను స్పెసిఫికేషన్స్‌ ప్రకారం ఆయా వ్యాపార సంస్థల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో డెస్క్‌లు సరఫరా చేసే వ్యాపార సంస్థలు వెయ్యికిపైగా ఉన్నాయి. విద్యాశాఖ నిర్దేశిత ప్రమాణాలతో కూడిన డ్యుయల్‌ డెస్క్‌లు రూ.1,600 నుంచి రూ.3,500 వరకు ధర ఉన్నాయి. కానీ దాని నుంచి కొనుగోలు చేసేందుకు విద్యా శాఖ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాగా, ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో విచారణకు ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌ ఈ విషయాన్ని తేల్చాలని జైలు అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది.

ధరలు మేం నిర్ణయించం..
లక్ష డ్యుయల్‌ డెస్క్‌ల కొనుగోలు కోసం చర్లపల్లి జైలుకు ఆర్డర్‌ ఇచ్చింది వాస్తవమే. జైళ్లలో తయారయ్యే వస్తువులను ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేయాలన్న నిబంధన ఉంది. ఆ మేరకే మేం ఆర్డర్‌ ఇచ్చాం. అయితే ధరలను మేం నిర్ణయించం. మేం ఇచ్చిన స్పెసిఫికేషన్స్‌ ప్రకారం జైలు అధికారులే ధర నిర్ణయించారు. ఆ ప్రకారమే కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చాం.
– కిషన్, పాఠశాల విద్యా కమిషనర్‌  

మరిన్ని వార్తలు