తప్పిన ముప్పు

29 Jul, 2014 02:41 IST|Sakshi
తప్పిన ముప్పు

* మద్యం మత్తులో స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్
* రెండు కార్లు, ఓ ట్రాక్టర్‌ను ఢీకొన్న వాహనం


కీసర: డ్రైవర్ తప్పతాగి స్కూల్ బస్సును నడిపి రెండు కార్లు, ఓ ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని నాగారం సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రాంపల్లి గ్రామంలోని రికిల్‌పోర్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సులో 15 మంది విద్యార్థులను ఎక్కించుకొని డ్రైవర్ సుధాకర్‌రెడ్డి బయలుదేరాడు. అప్పటికే అతిగా మద్యం తాగిన డ్రైవర్ బస్సును నాగారం, దమ్మాయిగూడల్లో 11 మంది విద్యార్థులను దింపాడు. మరో నలుగురిని కీసర, గోధుమకుంట, ప్రజయ్‌సాయి గార్డెన్‌లో దింపేందుకు బయలుదేరాడు.
 
 ఈ క్రమంలో నాగారం ఐకాం కంపెనీ వద్ద ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొట్టాడు. అనంతరం పక్కనే ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని బస్సు ఆగిపోయింది. బస్సులో కీసరకు చెందిన రిత్రిక, నేత్రికతో పాటు మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రమాదంతో వీరు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రెండు కార్లలో ఉన్న కృష్ణగౌడ్, శ్రీకాంత్‌గౌడ్, మహేందర్‌గౌడ్, శైలజ, లావణ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చిన్నారులను కిందికి దించి, మత్తులో ఉన్న  డ్రైవర్ సుధాకర్‌రెడ్డిని చితకబాదారు. అనంతరం  పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు కీసర సీఐ కృష్ణకిషోర్ తెలిపారు.

మరిన్ని వార్తలు