ఆ అమ్మాయి ఇంట్రావర్త్‌గా మారింది..

25 Apr, 2020 07:58 IST|Sakshi

నిశ్శబ్దంతో పిల్లల్లో ఒంటరితనం 

అంతర్ముఖులుగా మారుతున్న వైనం

నెల రోజులు దాటిన లాక్‌డౌన్‌    

నిపుణుల కౌన్సెలింగ్‌లో ఫిర్యాదుల వెల్లువ

‘స్నేహ... నైంత్‌ క్లాస్‌ అమ్మాయి. స్కూళ్లు ఓపెన్‌ అయితే టెన్త్‌లో చేరుతుంది. కొద్ది రోజులుగాఅన్నం సరిగ్గా తినడం లేదు. ఆకలి ఉండటం లేదు. ముభావంగా ఉంటోంది. నిద్ర కూడా సరిగ్గా లేదు. ఎప్పుడు నిద్ర పోతుందో, ఎప్పుడు మేల్కొంటుందోతెలియదు. తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో మానసిక వైద్య నిపుణులను సంప్రదించారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం అవడం వల్ల ఆ అమ్మాయి ఇంట్రావర్త్‌ మారినట్లు డాక్టర్లు చెప్పారు. కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఒక్క స్నేహ మాత్రమే కాదు, చాలామంది పిల్లలపైన లాక్‌డౌన్‌ అనేకరకాలుగా ప్రభావంచూపుతోంది. ప్రత్యేకించి టీనేజ్‌ పిల్లలు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. 

సాక్షి, సిటీబ్యూరో :ఆడుతూ.. పాడుతూ.. గలగలా మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీల్లో స్నేహితులతో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొనే పిల్లలు ఇళ్లకే పరిమితం కావడంతో ఆకస్మాత్తుగా అంతర్ముఖులుగా మారుతున్నట్లు మానసిక నిపుణులు చెబుతున్నారు. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి తిరిగి నిద్రకు ఉపక్రమించే వరకు కేవలం ఇంటికే పరిమితం కావడం, ఎలాంటి ప్రత్యేకత, ఎలాంటి మార్పు లేని రొటీన్‌ దినచర్య పిల్లలను  ఒంటరితనానికి గురిచేస్తోంది. మరోవైపు తల్లిదండ్రులతో కలిసి ఇళ్లలోనే ఉంటున్నా వారి మధ్య స్నేహపూర్వ వాతావరణం లేకపోవడం వల్ల ఒకవిధమైన డిప్రెషన్‌కు గురవుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

జీవన శైలిలో అనూహ్యమైన మార్పులు..
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినట్లుగానే తల్లిదండ్రులు పిల్లలను కట్టడి చేస్తున్నారు. ఇంట్లోనే ఉన్నప్పటికీ నిరంతర నిఘా నేత్రాల్లో వారిని కనిపెట్టుకొని ఉండటం, ఏం చేయాలో, ఏం చేయవద్దో పదే పదే చెప్పడం వల్ల స్వేచ్ఛయుత వాతావరణానికి దూరం అవుతున్నారు. ‘లాక్‌డౌన్‌ అనేదే ఒక శిక్ష లాంటిది అయితే తల్లిదండ్రుల ఆంక్షలు వారి పట్ల అదనపు శిక్షగా మారుతున్నాయి.’ అని చెప్పారు  ప్రముఖ మానసిక నిపుణులు డాక్టర్‌ లావణ్య. 

‘ఎప్పుడు తినాలి, ఏం తినాలి, ఏ టైమ్‌కు నిద్రపోవాలి, టీవీల్లో, నెట్లో, ఫోన్లలో ఎలాంటివి వీక్షించాలి వంటి అనేక అంశాలపై ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ‘అలా కాకుండా పిల్లలు తమ అభిప్రాయాలను, ఆలోచనలను తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకొనే స్నేహపూరితమైన వాతావరణం ఉండాలి.’ అని ఆమె అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా, పేరెంట్స్‌ ఆంక్షల వల్ల వచ్చిన మార్పుల్లో భాగంగా చాలామంది పిల్లలు పగటిపూట నిద్రపోతూ రాత్రుళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉంటున్నారు. మరోవైపు బయటకు వెళ్లి ఆడుకొనేందుకు కూడా అవకాశం లేదు. వీటికి తోడు 24 గంటలు ఇంట్లో ఉండటం వల్ల జంక్‌ఫుడ్, ఇతరత్రా  మోతాదుకు మించి తీసుకొనే ఆహారం పిల్లలను స్థూలకాయంలోకి నెడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. 

ఏమిటీ ఈ వైరాగ్యం..
నిజానికి ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమాలు, సమ్మర్‌ క్యాంపులు, టీవీల్లో సినిమాలు, ఇంటర్నెట్‌ వంటి అన్ని రకాల  సదుపాయాలు ఇంట్లోనే ఉన్నప్పటికీ ఒకరకమైన వైరాగ్యం నెలకొంటోంది. ఇంట్లో అందరూ ఉంటున్నా ఎవరి ప్రపంచం వారిదే అన్నట్లుగా మారింది. ‘సాధారణంగా అయితే ఉదయం ఇళ్ల నుంచి బయటకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇళ్లకు చేరుకున్నప్పుడు ఒకరికొకరు చెప్పుకునేందుకు చాలా విశేషాలు ఉంటాయి. పిల్లలు స్కూల్‌ విశేషాలను చెబుతారు. పెద్దవాళ్లు ఆఫీసు ముచ్చట్లు ఏకరువు పెడుతారు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్స్‌ పెరుగుతాయ. ఏ రోజుకు ఆ రోజు కొత్తదనాన్ని సంతరించుకుంటుంది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా జీవితంలో అలాంటి  వైవిధ్యానికి అవకాశం లేకుండా పోతోంది.’ అని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ సంహిత అన్నారు. పిల్లలు స్నేహితులతో, టీచర్లతో గడిపే సమయం ఎంతో విలువైంది. వారిలో సృజనాత్మకతను పెంచుతుంది.  

ఇలా చేస్తే కోపం..రమ్మన్నా రాదు..
ఒక్కోసారి భార్యాభర్తలపై ఒకరిపై ఒకరికి కోపం రావచ్చు.. ఇలాంటప్పుడు ఆ కోపం తగ్గాలంటే సాధారణంగా ఒకళ్లనొకరు తిట్టేసుకుంటారు. తర్వాత కోపం తగ్గాలంటే సరదాగా గడిపిన రోజులు, మధుర క్షణాలను గుర్తుచేసుకోండి.. అప్పుడు కోపం రమ్మన్నా రాదు.. తిట్టమన్నా తిట్టరు పైగా అయ్యో పాపం అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మీ పిల్లలకి మీ మీద గౌరవం పెరుగుతుంది. మీ మాట వింటారు.. కోపాన్ని బలవంతంగా నియంత్రించుకోవడం మంచిది కాదు.. అలాని కోపాన్ని ప్రదర్శించడం అసలే మంచిది కాదు. నేను చెప్పిన విధానంలో కోపం మంచులా కరిగి పోతుంది.  – బి.మల్లిఖార్జున దీక్షిత్, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌

ఉచిత కౌన్సెలింగ్‌ 
18 సంవత్సరాలలోపు అమ్మాయిలు, అబ్బాయిలు తమ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునేందుకు వారు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను వారితోనే చర్చించి పరిష్కరించేందుకు టెలీకౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు తెలిపారు. డిప్రెషన్‌కు గురయ్యే పిల్లలకు ప్రముఖ సైకోథెరపిస్ట్‌ డాక్టర్‌ లావణ్య మిరియం ఫోన్‌ కౌన్సిలింగ్‌ ద్వారా సమస్యలకు పరిష్కారం చూపుతారు. ఈ సేవలు పూర్తిగా ఉచితం. పిల్లలు, వారి తల్లిదండ్రులు ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఫోన్‌: 99897 52455 లేదా 77300 73344 నెంబర్లలో సంప్రదించవచ్చు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు