దెయ్యం బూచితో మూతపడిన స్కూలు

7 Jan, 2016 19:08 IST|Sakshi

చందంపేట (నల్లగొండ): ఆ ఊళ్లో ఓ మహిళకు అనారోగ్యం సోకింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఆమెకు దయ్యం పట్టిందని అందుకే అలా జరుగుతోందని గ్రామంలో పుకారు లేచింది. గ్రామ పొలిమేరల్లోని సమాధుల వద్ద ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్దకు ఆమె వెళ్లడమే కారణమని అనుకున్నారు. ఈలోపు మరొకరికి కూడా జబ్బు చేసింది. ఇంక అంతే... బడి వైపు వెళ్తే అలాగే జరుగుతుందని అనుమానించారు. దీంతో తమ పిల్లలను ఆ బడికి పంపడం మానేశారు. దీంతో 15 రోజులుగా ఆ పాఠశాల మూతబడింది.

నల్లగొండ జిల్లా చందంపేట మండలం గట్టుకిందితండా గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఉదంతం గురువారం తాజాగా వెలుగులోకి వచ్చింది. అచ్చంపేట పట్టిగా పిలువబడే చందంపేట గ్రామపంచాయతీ గట్టుకింది తండా ప్రాథమిక పాఠశాలలో 22 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యా వాలంటీర్‌తోనే నెట్టుకొస్తున్నారు. కొన్ని రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమెకు దెయ్యం పట్టిందని భావించిన వారి బంధువులు పలు చోట్ల తిప్పారు. ఎంతకూ తగ్గకపోవడం, మరొకరికి కూడా అనారోగ్యం రావడంతో సమాధులున్న చోట నిర్మించిన బడి వైపు వెళ్లడం వల్లే వారికి దెయ్యం పట్టిందని భావించారు.

తమ పిల్లలకు కూడా ఎక్కడ దెయ్యం పడుతుందోనని భావించి విద్యార్థుల తల్లిదండ్రులు బడికి పంపడం మానేశారు. విషయం చందంపేట ఎంఈఓ సామ్యనాయక్‌కు తెలియడంతో ఆయన ఈనెల 4న గ్రామానికి వెళ్లారు. విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. పిల్లలను పంపించకపోవడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించడంతో వారు ఇదే విషయాన్ని ఏకరువు పెట్టుకున్నారు. మూఢవిశ్వాసాలపై ఆయన వారికి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ‘మా పిల్లలకు ఏమైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా' అని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఆయన ఈ విషయాన్ని తహసీల్దార్ ప్రవీణ్‌నాయక్ దృష్టికి తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు