స్కూలు ముందు అయ్యప్ప భక్తుల ధర్నా

11 Dec, 2019 10:14 IST|Sakshi
ప్రైవేటు పాఠశాల ఎదుట విద్యార్థితో కలిసి ధర్నా చేస్తున్న అయ్యప్ప భక్తులు

సాక్షి, నర్సాపూర్‌: అయ్యప్ప మాల ధరించిన విద్యార్థిని అయ్యప్ప డ్రెస్సులో పాఠశాలకు రావద్దని ప్రిన్సిపాల్‌ హెచ్చరించడంతో తలెత్తిన వివాదం పాఠశాల డైరెక్టర్‌ క్షమాపణ చెప్పడంతో సద్దుమణిగింది. నర్సాపూర్‌కు చెందిన శేఖర్‌ కుమారుడు ప్రసాద్‌ స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. అతను గత నెల 17న అయ్యప్ప మాల ధరించి రోజూ స్కూలుకు వెళ్తున్నాడు. సోమవారం ప్రసాద్‌ను పాఠశాల ప్రిన్సిపాల్‌ మేఘన తన ఆఫీస్‌కు పిలిపించుకుని అయ్యప్ప మాల డ్రెస్‌ తీసేసి స్కూల్‌ యూనిఫాంలో రావాలని హెచ్చరించిందని అతని తండ్రి శేఖర్, అయ్యప్ప గురుస్వాములు రమేష్‌గౌడ్, అమర్‌నాథ్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ రాజేందర్‌ తదితరులు ఆరోపించారు. ప్రిన్సిపాల్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ వారు మంగళవారం పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్‌ మేఘనను నిలదీశారు. పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు.

స్థానిక సీఐ నాగయ్య వచ్చి సముదాయించినా వారు వినకుండా పాఠశాల డైరెక్టర్లు రావాలని డిమాండు చేస్తూ ధర్నాను కొనసాగించారు. పాఠశాల డైరెక్టర్లు స్వరూప్‌రెడ్డి, నర్సిరెడ్డిలు ధర్నా చేస్తున్న వారి వద్దకు వచ్చారు. స్వరూప్‌రెడ్డి అయ్యప్ప మాలదారులతో మాట్లాడుతూ తమకు, తమ సిబ్బందికి ఎవరిని ద్వేషించే ఉద్దేశం లేదని ఈ ఘటనతో ఎవరైనా మనస్తాపానికి గురైతే మమ్మల్ని క్షమించాలని కోరారు. ప్రిన్సిపాల్‌ వ్యాఖ్యలను వివాదం చేయాలన్న ఉద్దేశం తమకు లేదని అయ్యప్ప దీక్షదారులు వివరిస్తూ ధర్నా విరమించి డైరెక్టర్ల ఆఫీసులోకి వెళ్లి కొంత సేపు వారితో మాట్లాడారు. ఇలాంటి తగాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక సీఐ నాగయ్య పాఠశాల డైరెక్టర్లకు సూచించారు.

>
మరిన్ని వార్తలు