వచ్చే ఏడాదీ జూన్‌ 12నే స్కూళ్లు

12 Jun, 2019 01:43 IST|Sakshi

పాఠశాల విద్యాశాఖ వార్షిక క్యాలెండర్‌  విడుదల

సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 13 వరకు దసరా సెలవులు 

డిసెంబర్‌ 22 నుంచి 28 వరకు క్రిస్మస్‌ సెలవులు 

వచ్చే జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు 

పాత విధానంలోనే వేసవి సెలవులు 

వచ్చే ఏడాది ఏప్రిల్‌ 23 పాఠశాలలకు చివరి పనిదినం

సాక్షి, హైదరాబాద్‌: ఈ విద్యాసంవత్సరానికి సం బంధించి విద్యా శాఖ క్యాలెండర్‌ ఖరారైంది. వచ్చే ఏడాది కూడా వేసవి సెలవుల తరువాత జూన్‌ 12వ తేదీ నుంచే (2020–21 విద్యా సంవత్సరంలో) పాఠశాలలను ప్రారంభించాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయిచింది. గత సంవత్సరం జారీ చేసిన అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈ నెల ఒకటవ తేదీ నుంచే పాఠశాలలను ప్రారంభించాల్సి ఉన్నా వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఈ నెల 12వ తేదీ నుంచి(బుధవారం) స్కూళ్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని విద్యాశాఖ నిర్ణయిం చింది. ఈ మేరకు 2019–20 అకడమిక్‌ క్యాలెండర్‌ను డీఈవోలకు మంగళవారం జారీ చేసింది.

పాఠశాలల వేళలు 
ఈసారి పాఠశాలల సమయాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి.
 
ఇతర కార్యక్రమాలు.. 
స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలను(ఆరు) జూన్, అక్టోబర్, మార్చి నెలల్లో మినహా మిగిలిన అన్ని నెలల్లోనూ నిర్వహించాలి. పాఠశాల వార్షికోత్సవాలను జనవరి, ఫిబ్రవరిల్లో నిర్వహించాలి. బాలసభలను ప్రతినెలా మొదటి శనివారం నిర్వహించాలి. ప్రతి శుక్రవారం మాస్‌డ్రిల్, యోగా కార్యక్రమాలు నిర్వహించాలి.
 
క్రీడల నిర్వహణ... 
పాఠశాల స్థాయి క్రీడలు ఆగస్టు రెండోవారం లోపు, జిల్లాస్థాయి పోటీలు సెప్టెంబర్‌ 3వ వారంలోపు, రాష్ట్రస్థాయి పోటీలు సెప్టెంబర్‌ 4వ తేదీలోపు నిర్వహించాలి.

డిజిటల్‌ తరగతులు
డిజిటల్‌ తరగతులకు సంబంధించిన టైంటేబుల్‌ను అధికారులు నిర్ణయించారు. పదో తరగతి వారికి 10.40 గంటలకు రెండో పీరియడ్‌లో నిర్వహించాలి. తొమ్మిదో తరగతి వారికి మూడో పీరియడ్‌లో 11.40 గంటలకు, 8వ తరగతి వారికి 5వ పీరియడ్‌లో 1.50 గంటలకు, 7వ తరగతి వారికి ఆరో పీరియడ్‌లో 2.40 గంటలకు, ఆరో తరగతి వారికి ఏడో పీరియడ్‌లో 3.30 గంటలకు నిర్వహించాలి. 

క్యాలెండర్‌ ప్రకారం...
- ఈ ఏడాది(వచ్చే) సెప్టెంబర్‌ 28వ తేదీ నుంచి అక్టోబర్‌ 13 వరకు దసరా సెలవులు ఉంటాయి. 
మిషనరీ స్కూళ్లకు డిసెంబర్‌ 22 నుంచి 28 వరకు క్రిస్మస్‌ సెలవులు 
ఇతర స్కూళ్లకు 2020 జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు 
2019–20 విద్యా సంవత్సరంలో చివరి పనిదినం 2020 ఏప్రిల్‌ 23 
2020 ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు

ఆయా తరగతుల పరీక్షల షెడ్యూలు..
ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ)–1 పరీక్షలు జూలై 31 నాటికి, ఎఫ్‌ఏ –2 సెప్టెంబర్‌ 27వ తేదీ నాటికి నిర్వహించాలి. సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ)–1 పరీక్షలు అక్టోబర్‌ 21 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించాలి. ఎఫ్‌ఏ–3 నవంబర్‌ 30 నాటికి, ఎఫ్‌ఏ–4 పరీక్షలను 2020 జనవరి 31 లోపు పదో తరగతి వారికి, ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వారికి ఫిబ్రవరి 29 లోపు నిర్వహించాలి. పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షలు ఫిబ్రవరి 29లోపు నిర్వహించాలి. ఎస్సెస్సీ బోర్డు పరీక్షలు మార్చి నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 1 నుంచి 9వ తరగతి వరకున్న విద్యార్థులకు ఎస్‌ఏ–2 పరీక్షలు నిర్వహించాలి. అదే నెల 10వ తేదీన ప్రోగ్రెస్‌ కార్డులు విద్యార్థులకు అందించాలి. 11న తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలి. 12వ తేదీన ప్రోగ్రెస్‌ కార్డులను విద్యార్థుల నుంచి తీసుకోవాలి. జనవరి 31లోగా పదో తరగతి సిలబస్‌ పూర్తి చేసి, ఫిబ్రవరి నుంచి రివిజన్‌ క్లాసులు నిర్వహించాలి. 9వ తరగతిలోపు విద్యార్థులకు సిలబస్‌ను ఫిబ్రవరి 28 వరకు పూర్తిచేయాలి.

మరిన్ని వార్తలు