చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి

15 Feb, 2020 07:50 IST|Sakshi
మహేష్‌ (ఫైల్‌)

పాఠశాల భవనం పైనుంచి దూకిన

ఘటనలో తీవ్ర గాయాలు

15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స

సనత్‌నగర్‌: పాఠశాల భవనంపై నుంచి దూకి తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.  ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా, ఐ–పోలవరం ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు కుటుంబంతో సహా  నగరానికి వలసవచ్చి ఎస్‌ఆర్‌నగర్‌లోని సాయిటవర్స్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు మహేష్‌ (14) జయప్రకాష్‌నగర్‌లోని విశ్వభారతి స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. గత నెల 29న మహేష్‌ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అల్లరి చేస్తుండడంతో  వైస్‌ ప్రిన్సిపాల్‌ వారిని బయట నిల్చోబెట్టాడు.

ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పి, టీసీ ఇచ్చి పంపుతామని హెచ్చరించడంతో ఆందోళనకు గురైన   మహేష్‌ పాఠశాల భవనం మూడో ఫ్లోర్‌కు వెళ్లి కిందకు దూకాడు. నేరుగా అతను కింద పార్కు చేసి ఉన్న స్కూల్‌ బస్సుకు తగలడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అతడి తండ్రి నాగేశ్వరరావు మహేష్‌ను అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. అక్కడి నుంచి ఈఎస్‌ఐ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా విద్యార్థి మృతికి కారణమైన విశ్వభారతి హైస్కూల్‌ గుర్తింపును రద్దు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు కోరారు.

మరిన్ని వార్తలు