కలుషిత కాటు

9 Jul, 2019 10:45 IST|Sakshi
నిలోఫర్‌లో చికిత్సలు పొందుతున్న గురుకుల విద్యార్థులు

33 మంది చిన్నారులకు అస్వస్థత

కలుషిత ఆహారం తిని వాంతులు విరేచనాలు

మైనార్టీ గురుకుల విద్యాలయంలో ఘటన

నిలోఫర్‌కు తరలింపు

విజయనగర్‌ కాలనీలోని మైనార్టీ గురుకుల విద్యాలయంలో సోమవారం ఉదయం కలుషిత ఆహారం తిని 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారం తీసుకున్న కొద్దిసేపటికే వారికి వాంతులు, విరేచనాలయ్యాయి. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థులంతా కోలుకుంటున్నారని వైద్యులు పేర్కొన్నారు. తీసుకున్న ఆహారం లేదా మంచినీళ్లు కలుషితమై ఉండొచ్చని భావిస్తున్నారు.  

నాంపల్లి: మైనార్టీ గురుకుల విద్యాలయంలో కలుíషిత ఆహారం తిని 33 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. సోమవారం ఉదయం విజయనగర్‌ కాలనీలోని మైనార్టీ గురుకుల విద్యాలయంలో ఈ సంఘటన జరిగింది.  విద్యార్థులు ఉదయాన్నే అల్పాహారాన్ని తీసుకున్నారు. తిన్న కాసేపటికే వాంతులు, విరేచనాలు అయ్యాయి. మరికొందరు సొమ్మసిల్లి కిందపడిపోయారు. విషయాన్ని తెలుసుకున్న వసతిగృహం సిబ్బంది హుటాహుటిన సమీపంలోని నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు.  చికిత్స పొందుతున్న విద్యార్థులందరూ కోలుకుంటున్నారని నిలోఫర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణ తెలిపారు. మరో 36 గంటల పాటు ఆసుపత్రిలోనే వైద్య చికిత్సలు అందజేస్తామన్నారు. విద్యార్థుల వయస్సు 10–12 సంవత్సరాల లోపు ఉంటుందని చెప్పారు. విషయం తెలుసుకున్న నాంపల్లి నియోజకవ్గం ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మెరాజ్‌ నిలోఫర్‌కు వచ్చివిద్యార్థులను పరామర్శించారు.  తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ కోలుకుంటున్నట్లు తెలిపారు.ఈ సంఘటనపై విచారణ జరిపిస్తామని, విద్యార్థులు స్వీకరించిన ఆహారంలో లోపమా లేక మంచినీళ్లలోనా అనే అంశంపై చర్చిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు