చెరువు పరిరక్షణ కోసం విద్యార్థుల ర్యాలీ

6 Jul, 2019 19:50 IST|Sakshi

సాక్షి, నాగారం: అన్నరాయని చెరువును కాపాడాలని కోరుతూ నాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి చెరువు వరకు ఈ ర్యాలీ సాగింది. చెరువును రక్షించుకుందామంటూ దారిపొడవునా విద్యార్థులు నినదించారు. చెరువు కట్ట మీద విద్యార్థులను కూర్చొబెట్టి అన్నరాయని చెరువు పరిరక్షణ సమితి సభ్యులు అవగాహన కల్పించారు. చెరువును కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను, నీటి ప్రాముఖ్యాన్ని వివరించారు.

గత వారం కూడా ఇదే రోజున ర్యాలీ నిర్వహించామని, వరుసగా రెండో వారం విద్యార్థులు తరలిరావడం సంతోషంగా ఉందని అన్నరాయని చెరువు పరిరక్షణ సమితి సభ్యులు అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లారెడ్డి, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాకేశ్‌, కృష్ణమాచార్యులు, శాంప్రసాద్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈనెల 14న చక్రీపురం నుంచి చెరువు వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. నాగారం వాసులతో పాటు పర్యావరణ ప్రియులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

కొనసాగుతున్న ఆక్రమణలు
ఒకపక్క చెరువు పరిరక్షణ కోసం పాటుపడుతుంటే మరోపక్క ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ఎస్వీ నగర్‌ రోడ్డు నంబర్‌ 7 వద్ద దుండగులు ఆక్రమణలకు తెర తీశారు. దీనిపై కీసర ఎమ్మార్వో, స్థానిక వీఆర్‌ఓలకు ఫిర్యాదు చేసినట్టు ఎస్వీనగర్‌ కాలనీ వాసి కొమిరెల్లి సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి చెరువును కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు