ఆటల్లేని.. చదువులు..!

15 Jun, 2019 08:19 IST|Sakshi

ఆట, పాటలతో     ఆనందంగా కొనసాగాల్సిన విద్యార్థుల చదువు.. జీవితం తరగతి గోడలకే పరిమితమవుతోంది.  మైదానాలు ఉంటే వ్యాయామ ఉపాధ్యాయులు ఉండరు.. వ్యాయామ ఉపాధ్యాయులు ఉంటే మైదానాలూ ఉండవు. ఇవి రెండూ లేని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కోకొల్లలు.

మంచిర్యాలసిటీ: అత్తెసరు వ్యాయామ ఉపాధ్యాయులతో అరకొర మైదానాలతో జిల్లాలోని విద్యార్థులు ఆటలకు దూరమై.. కేవలం చదువుకే పరిమితమవుతున్నారు. మానసిక ప్రశాంతత కొరవడి చదువుకు కూడా దూరమవుతున్న వారు అనేకమంది విద్యార్థులు జిల్లాల్లో ఉండటం గమనార్హం. ఆటలంటే ఇష్టమున్న విద్యార్థులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. దీంతో చదువుకు, ఆటలకు దూరమై విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, కళాశాలలు 523 ఉండగా.. 338 విద్యాలయాల్లో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం 185 విద్యాసంస్థల్లో మాత్రమే వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 36 శాతం విద్యాలయాల్లో మాత్రమే విద్యార్థులకు క్రీడలు అందుబాటులో ఉండగా.. 64 శాతం సంస్థల్లో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు.
 
మైదానాల పరిస్థితి
ఉమ్మడి జిల్లాలో 466 ఉన్నత పాఠశాలలకుగాను సుమారు 150 పాఠశాలలకు మైదానాలు లేవు. 46 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా.. 20కి పైగా కళాశాలలకు మైదానాలు లేవు. 11 డిగ్రీ కళాశాలలకు మైదానాలు ఉన్నా.. తొమ్మిది కళాశాలలకు వ్యాయామ అధ్యాపకులు లేరు.

అవసరమైన స్థలం
అన్ని రకాల ఆటలను విద్యార్థులతో ఆడించేందుకు కొలతల ప్రకారం స్థలం అవసరం ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలకు ఒకటిన్నర ఎకరం, ప్రాథమికోన్నత పాఠశాలలకు  మూడెకరాలు, ఉన్నత పాఠశాలలకు ఐదెకరాల స్థలం ఉంటే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. జూనియర్‌ కళాశాలలకు ఐదు, డిగ్రీ కళాశాలలకు పదెకరాల స్థలం ఉండాలి.

పోస్టులు  భర్తీ చేయాలి
విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి. పీఈటీలకు పీడీలుగా పదోన్నతులు ఇవ్వకపోవడంతో అనేక పాఠశాలల్లో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పీడీలకు పదోన్నతులు ఇచ్చిన నేపథ్యంలో జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు ఆటలు ఆడించడానికి అవకాశం ఉండేది. ఖాళీల ప్రభావంతోనే విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆటలు దూరమై, కేవలం చదువుకే పరిమితమవుతున్నారు.  – బెల్లం శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు, తాండూర్‌ మండలం

మరిన్ని వార్తలు