229 పాఠశాలలు మూత!

14 Sep, 2014 23:29 IST|Sakshi

 జిల్లాలో 75 కంటే తక్కువ మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు                         67
 ప్రాథమికోన్నత స్కూలల్లో 6,7 తరగతుల్లో 20 కన్నా తక్కువ పిల్లలున్న స్కూళ్లు      57
 ఇరవై మందికన్నా తక్కువ పిల్లలున్న ప్రాథమిక పాఠశాలలు                                     105

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం త్వరలో అమలుచేయబోయే పాఠశాలల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియతో జిల్లాలో దాదాపు 229 పాఠశాలలు మూతపడనున్నాయి. దసరా సెలవుల్లో రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను తేల్చడంలో నిమగ్నమయ్యారు. ఒకట్రెండు రోజుల్లో రేషనలైజేషన్ ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల కానున్నప్పటికీ.. ఆ వివరాలపై జిల్లా విద్యాశాఖకు సూచనప్రాయంగా ఆదేశాలందాయి. దీంతో చర్యలు చేపట్టిన జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రాథమిక వివరాలతో నివేదిక తయారు చేశారు. రేషనలైజేషన్ ప్రక్రియతో జిల్లాలో దాదాపు 229 పాఠశాలలు మూతపడనున్నట్లు గుర్తించి అవాక్కయ్యారు.

 ఇంత వెనక‘బడి’పోయామా?
 జిల్లాలో 2,321 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 1,651 ప్రాథమిక, 244 ప్రాథమికోన్నత, 426 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో దాదాపు 3.51లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మౌలిక వసతుల సమస్య, ప్రైవేటు పాఠశాలల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. పలు పాఠశాలల్లో ఇద్దరేసి టీచర్లున్నా విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. దీంతో పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.

ఈ క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ ప్రక్రియపై విద్యాశాఖ సైతం మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వం ముందు పెట్టింది. ఒకట్రెండు రోజుల్లో వీటికి ఆమెదం పడనుంది. జిల్లా విద్యాశాఖ తయారుచేసిన ప్రాథమిక వివరాల ప్రకారం జిల్లాలో 75 మంది కంటే తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 67 ఉన్నాయి. కనీసం 75 మంది విద్యార్థులుంటే గానీ ఉన్నత పాఠశాలలను నడపొద్దని సర్కారు నిర్ణయించింది. దీంతో ఈ పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. అదేవిధంగా మరోవైపు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతుల్లో కనీసం 20 మంది విద్యార్థులుండాలనే నిబంధన పెట్టింది.

 అదేవిధంగా ప్రాథమిక పాఠశాలల్లోనూ కనీసం 20 మంది పిల్లలుండాలి. కానీ జిల్లాలోని 57 యూపీఎస్‌లలోని 6,7 తరగతుల్లో 20 మంది పిల్లులు కూడా లేరు. 105 ప్రాథమిక పాఠశాలల్లోనూ పిల్లల సంఖ్య 20కి మించలేదు. తాజా రేషనలైజేషన్‌తో ఇవన్నీ మూతపడనున్నాయి.

 టీచర్లు తారుమారు..
 త్వరలో రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయితే జిల్లాలో దాదాపు వెయ్యిమంది టీచర్లకు స్థాన చలనం కలగనుంది. పిల్లలులేని కారణంగా బడులు మూసివేయడంతో.. అక్కడ పనిచేసే టీచర్లను సమీప పాఠశాలలకు బదిలీ చేయనున్నారు. అదేవిధంగా టీచర్ల నిష్పత్తి, విద్యార్థుల నిష్పత్తిలో తేడా ఉన్న పాఠశాలల్లోనూ ఉపాధ్యాయుల సంఖ్య మారనుంది. మొత్తంగా మార్గదర్శకాలు విడుదలైన అనంతరం ఈ మార్పుల అంశంపై స్పష్టత రానుంది.

మరిన్ని వార్తలు