విద్యార్థులు తక్కువున్న స్కూళ్లు తరలింపు!

14 Jun, 2019 03:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టీచర్లను అవసరమున్న చోట సర్దుబాటుకు ఏర్పాట్లు 

విద్యార్థులందరికీ రవాణా సదుపాయం 

చర్యలు చేపట్టిన విద్యాశాఖ..  

ఎంఈవోలకు ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని స్కూళ్లు 793 ఉండగా, ఒకటి నుంచి పదిమంది లోపే విద్యార్థులున్న స్కూళ్లు 1,544 ఉన్నాయి. ఇపుడు ఆ స్కూళ్లన్నీ సమీపంలోని మరో పాఠశాలల పరిధిలోకి వెళ్లనున్నాయి. అవేకాదు 20 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలు, 30 మందిలోపు ఉన్న ఉన్నత పాఠశాలలది కూడా అదే పరిస్థితి. మరోవైపు ఒక్క విద్యార్థి లేని స్కూళ్లలో 715 మంది టీచర్లు ఉండగా, వారిని గతేడాదే అవసరం ఉన్న స్కూళ్లలో సర్దుబాటు చేశారు. ఇక 1 నుంచి 10 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లలో 1,900 మంది టీచర్లు ఉన్నారు. ఇప్పుడు వారితో పాటు ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లలోని టీచర్లు, 30 మందిలో విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లోని టీచర్లను అవసరం ఉన్న స్కూళ్లకు పంపించనున్నారు.

విద్యా శాఖ గతేడాది ఈ లెక్కలు వేసింది. తాజాగా ఆ వివరాలను సేకరించి, అలాంటి పాఠశాలలను సమీప పాఠశాలల్లో రీలొకేట్‌ చేసేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. వాటిల్లోని టీచర్లను టీచర్లను అవసరం ఉన్న పాఠశాలల్లోకి తరలించేందుకు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఈనెల 11న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాల్లో డీఈవోలు పాఠశాల రీలొకేషన్‌కు చర్యలు చేపట్టారు. అక్కడి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా వారిని సమీప స్కూళ్లకు పంపించేందుకు రవాణ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా మండలాల వారీగా అలాంటి స్కూళ్లను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని మండల విద్యాధికారులకు (ఎంఈవో) డీఈవోలు ఆదేశాలు జారీ చేశారు. 

విద్యార్థులకు రవాణా సదుపాయం.. 
విద్యార్థులు తక్కువ ఉన్న పాఠశాలలను రీలొకేట్‌ చేయడం, టీచర్లను అవసరం ఉన్న స్కూళ్లకు పంపించడం ద్వారా అక్కడి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విద్యా శాఖ ఆదేశించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆవాస ప్రాంతంలో పాఠశాల లేకపోతే అక్కడి విద్యార్థులకు ట్రాన్స్‌పోర్టు సదుపాయం కల్పించాల్సి ఉంది. ఆ నిబంధనను పక్కాగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రీలొకేట్‌ చేసే స్కూళ్లలోని విద్యార్థులందరికి ట్రాన్స్‌పోర్టు సదుపాయం కల్పించేందుకు సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపించాలని డీఈవోలు ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు