శాస్త్రీయతే సరైన సమాధానం

5 Jul, 2020 03:51 IST|Sakshi

పరిశోధనలతోనే ఆయుర్వేదానికి ప్రాభవం

పరీక్షించి నిర్ధారిస్తే మన వారసత్వాన్ని నిలుపుకోవచ్చు

ఆయుష్‌ మంత్రిత్వ శాఖ చొరవ చూపాలి

సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నియంత్రణకు కేరళలో ఆయుర్వేదం.. తమిళనాడులో సిద్ధ.. చైనాలోనూ సంప్రదాయ వైద్యంతో మెరుగైన ఫలితాలు. తాజాగా రోగనిరోధక శక్తిని పెంచుతుందంటూ పతంజలి సంస్థ తయారీ కరోనిల్‌.. ఇదంతా బాగానే ఉంది. మరి మన పెరటి చెట్టు.. అంటే ఆయుర్వేదం కరోనా చికిత్సకు ఎందుకు ఉపయోగపడదు?. ఒకవేళ ఎవరైనా ఆయుర్వేద మందుతో కరోనాను పారదోలవచ్చనగానే.. అది శాస్త్రీయమైంది కాదనే విమర్శలెందుకు వస్తున్నాయి? వేల ఏళ్లుగా భారతీయ సంస్కృతిలో భాగమైన ఆయుర్వేదం శాస్త్రీయ వైద్యం కంటే తీసికట్టైందా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కునేందుకు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రాను ‘సాక్షి’ సంప్రదించింది. దీనిపై ఆయన ఏమన్నారంటే.. 

శాస్త్రీయంగా విశ్లేషించాలి.. 
ఆయుర్వేదమైనా, మరే ఇతర సంప్రదాయ వైద్యవిజ్ఞానమైనా వందల ఏళ్ల పరిశీలన, అనుభవాల విశ్లేషణ ఫలితంగా పుట్టుకొచ్చినవే. ఆధునిక వైద్య విధానం స్థూలమైన అంశాలను కాకుండా అత్యంత సూక్ష్మస్థాయిలో పరిశీలనలు చేసి ఫలితాలను రాబడుతుంది. అలాగని ఆయుర్వేదం పనికిరాదని కాదు. నిజానికి భారతీయులు గర్వించదగ్గ వైద్య విధానమిది. కాకపోతే శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందన్నట్లు ఈ ప్రాచీన పద్ధతులను, మందులను కూడా శాస్త్రీయ వైద్యం కాటాలో తూచాల్సి ఉంటుంది. ఒక్క కరోనాకు మాత్రమే కాదు, అన్ని రుగ్మతలకు సంప్రదాయ వైద్య విజ్ఞానం అందించే పరిష్కారాలేమిటో గుర్తించి వాటిని శాస్త్రీయంగా విశ్లేషించి నిజానిజాలను నిగ్గుతేలిస్తే ప్రజలకు చౌకగా, సమర్థమైన చికిత్సలు అందించడం వీలవుతుంది.

అంతేకాదు.. కృత్రిమ రసాయనాల స్థానంలో ప్రకృతిలోని మొక్కల నుంచి వనరులను సేకరించే పరిస్థితి ఏర్పడితే రైతులకూ లాభమే. ఆయుర్వేద మందుల్లో కొన్ని వందల మూలకాలుంటాయి. వీటిలో ఏది చికిత్సలో ఉపయోగపడుతుందో? ఏది కాదో తేల్చడం కష్టం. బహుశా అందువల్లే ఆయుర్వేద వైద్యం కొంత అననుకూల పరిస్థితులను ఎదుర్కొంటుందేమో. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పరిశోధనా సంస్థలు, ప్రైవేట్‌ ఫార్మా కంపెనీలు చొరవ తీసుకుని శాస్త్రీయంగా ఆయుర్వేద మందులను విశ్లేషించాలి. పొరుగున ఉన్న చైనా ఇప్పటికే ఈ పనిని విజయవంతంగా చేస్తోంది. ఆయుర్వేదం, ఇతర సంప్రదాయ వైద్య విధానాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ తగిన ఏర్పాట్లు చేయడం కూడా అవసరం. 

పరీక్షించకుండానే మందు అనలేం 
ప్రస్తుత కరోనా కష్టకాలంలో పతంజలి కరోనిల్‌ పేరుతో ఒక మందును తెచ్చింది. దీనిపై ఎలాంటి పరీక్షలు జరిగాయో ఎవరికీ తెలియదు. ఆయుర్వేద విధానంలోని మందులు ఎంతో విలువైనవి. ఇందులో సందేహం లేదు. అయితే వీటి తయారీకి ప్రామాణిక పద్ధతులు, వాడిన రోగులకు సంబంధించిన సమాచారం లేకపోతే దుర్వినియోగమయ్యే అవకాశాలెక్కువ. ఫలితంగా ఆయుర్వేదానికే ఎక్కువ నష్టం. పతంజలి ఉత్పత్తి కరోనిల్‌ ఉపయోగపడవచ్చు. కానీ దీన్ని ఉపయోగించే ముందు పరీక్షలు మాత్రం తప్పనిసరిగా జరగాల్సిందే. మనమిచ్చే మందు వల్ల రోగికి మేలు జరగకున్నా.. హాని జరగకూడదు.

అందుకే ఈ పరీక్షలు అవసరం. మందులు తీసుకున్న వారు ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నారని నిరూపించాలి కూడా. ఇలాంటి పరీక్షలు జరపకపోవడం వల్ల మనం మన వారసత్వాన్ని పోగొట్టుకుంటున్నట్లే. సీసీఎంబీ, ఇతర పరిశోధన సంస్థల్లో కణస్థాయిలో పరీక్షలు చేసేందుకు తగిన ఏర్పాట్లున్నాయి. వీటిని ఉపయోగించుకుని ఆయుర్వేద మందులను పరీక్షించవచ్చు. కరోనా విషయాన్నే తీసుకుంటే ఫలానా మందు నేరుగా వైరస్‌ను చంపుతుందని చెబితే దాన్ని పరీక్షించి నిర్ధారించవచ్చు. అలాకాక పరోక్ష పద్ధతుల్లో పనిచేసి అంటే రోగ నిరోధకశక్తిని పెంచడం ద్వారా వ్యాధిని నియంత్రిస్తుంటే మాత్రం ప్రత్యేక పద్ధతులను అవలంబించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు